ఫిఫా వరల్డ్ కప్ 2026: ఇరాన్ ప్లేయర్ల ప్రాణాలకు మేం గ్యారెంటీ ఇవ్వలేం: ట్రంప్
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:28 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ జట్టు.. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ ఏడాది జూన్ 11 నుంచి జులై 19 వరకు ఈ సాకర్ మెగా టోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో పాల్గొనలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని పేర్కొన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.
‘ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో ఆడటం, ఆడకపోవడం అనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికా వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ ప్రపంచ కప్‌నకు దూరంగా ఉండటమే మంచిది’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ మెగా టోర్నీలో మొత్తం 48 జట్లు పాల్గొననున్నాయి. నాలుగేసి జట్లు 12 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 78 మ్యాచ్‌లు అమెరికాలో జరుగుతాయి. కెనడాలో 13, మెక్సికోలో 13 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్ట్, న్యూజిలాండ్ జట్లతో తలపడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్