Share News

ఐపీఎల్2026 ధోనికి చివరి సీజన్ కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:51 PM

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి 2026 ఐపీఎల్ సీజనే చివరిది కావొచ్చంటూ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని లేని చెన్నై జట్టు, ఐపీఎల్ అసంపూర్ణంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్2026 ధోనికి చివరి సీజన్ కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
MS Dhoni last IPL season

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో చాలా జట్లు ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చాలా ప్రత్యేకమైనవి. కారణం.. ఆ రెండు జట్ల తరఫున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోని సీఎస్కే‌తో తన ప్రయాణం స్టార్ట్ చేశాడు. చెన్నైకి ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్‌ను సైతం అందించాడు. అతడు లేని సీఎస్కే జట్టును ఎవరూ ఊహించలేరు. త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా సీఎస్కే స్టార్ ధోని క్రికెట్ ప్రియులను అలరించనున్నాడు. అయితే ఈ సీజనే ఆయనకు చివరిది కావచ్చట. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.


తాజాగా జియో హాట్‌స్టార్‌తో ఇర్ఫాన్ మాట్లాడుతూ..' ధోని లేకుండా సీఎస్కే, ఐపీఎల్‌లను ఊహించడం కష్టం. అతన్ని పసుపు జెర్సీలో చూసే చివరి సీజన్ ఇదే కావచ్చు. ఇక నుంచి చెన్నై జట్టులోని అందరినీ ఒకచోట చేర్చడమే ధోని పాత్ర. సంజు శాంసన్, రుతురాజ్‌లను చెన్నై ఫ్రాంచైజీకి భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడంలో ధోని సహాయం చేస్తాడు' అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు.


'ఐపీఎల్‌లో ధోని ఎన్ని మ్యాచులు ఆడతాడో నాకు కచ్చితంగా తెలియదు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో అతని అనుభవం మాత్రం జట్టుకు చాలా సహాయపడుతుంది. సంజు కూడా సీఎస్కే జట్టులో భాగం కావడంతో ప్రయోజనం పొందుతాడు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను భవిష్యత్తు కోసం ధోని, సీఎస్కే జట్టు సిద్ధం చేస్తున్నారు. అలానే ఈ సారి టైటిల్ గెలిచి.. ధోనికి పరిపూర్ణంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే ఆటగాళ్లు, యాజమాన్యం చూస్తున్నారు' అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.


ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు(2010, 2011, 2018, 2021, 2023) సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది. వీటిల్లో ఎక్కువ టైటిల్స్ కు ధోని నాయకత్వం వహించాడు. ధోని ఆధ్వర్యంలో చెన్నై 14 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో గెలిచి ఆరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్

ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్

Updated Date - Mar 13 , 2026 | 05:06 PM