Share News

టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:04 PM

దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికాను తెలివితక్కువ జట్టుగా ఆయన అభివర్ణించాడు. సూపర్‌-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదని తెలిపాడు.

టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికా తెలివితక్కువ జట్టు: మైఖేల్ వాన్
Michael Vaughan

స్పోర్ట్స్ డెస్క్: దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026)లో సౌతాఫ్రికాను తెలివితక్కువ జట్టుగా ఆయన అభివర్ణించాడు. సూపర్‌-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదని తెలిపాడు. బలమైన జట్టుగా ఉన్న టీమిండియాను టోర్నీ నుంచి బయటకు పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.


'స్టిక్ టూ క్రికెట్' అనే పాడ్‍ కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ...' నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టీ20 ప్రపంచ కప్2026 టోర్నమెంట్‌లో తెలివితక్కువ జట్టు ఏదో చెప్పనా?. దక్షిణాఫ్రికా చాలా తెలివితక్కువ జట్టు అని నా అభిప్రాయం. ఎందుకంటే సూపర్-8లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను గెలవనిస్తే.. సెమీస్ రేసు నుంచి భారత్ తప్పుకునేది. ఆ సమయంలో వెస్టిండీస్, టీమిండియా సమాన పాయింట్లతో ఉన్నప్పటికీ.. నెట్ రన్‌రేట్‌తో విండీస్ ముందంజలో ఉంది. వెస్టిండీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచి భారత్‌ వరల్డ్‌ కప్‌లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారత జట్టు విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. చివరకు ఫైనల్‌లో న్యూజిలాండ్ ను ఓడించి.. టైటిల్ అందుకుంది. ఏ జట్టైన వరల్డ్‌ కప్‌ గెలవాలనుకుంటే.. ఉత్తమ జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలి’ అని మైఖేల్‌వాన్‌ అన్నాడు.


టీ20 ప్రపంచ కప్2026 సూపర్‌- 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో భారత్ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్ చరిత్రలోనే టీమిండియాకు ఇది పెద్ద ఓటమి. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో భారత జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్‌కు చేరి.. సెమీస్‌ అవకాశాలను కష్టతరం చేసుకుంది. కానీ జింబాబ్వే, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్ కు చేరింది. అక్కడ ఇంగ్లండ్ తో తుది వరకు పోరాడి.. చివరకు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరుకు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకుంది. దక్షిణాఫ్రికా మాత్రం సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తై టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

నా కోసం వరల్డ్ కప్2026 గెలుస్తావా?.. ఇషాన్‌కు సూర్య ఫోన్ కాల్..

Updated Date - Mar 13 , 2026 | 03:58 PM