పాక్‌పై భారత్ గెలుపు.. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:02 AM
పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో 61 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపొందింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
అభినందనలు: అమిత్ షా
భారత జట్టును అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ‘ఫార్మాట్లు, వేదికలు, తేదీలు మారినా.. పాక్‌పై భారత జట్టు నిలకడగా రాణిస్తోంది. టీమ్ అంతటికీ అభినందనలు’ అని అమిత్ షా పేర్కొన్నారు.
శుభాకాంక్షలు: బీసీసీఐ అధ్యక్షుడు
‘పాకిస్థాన్‌పై ప్రశాంతంగా, ధైర్యంగా టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ పేర్కొన్నారు.
ఇషాన్ బ్యాటింగ్ అదుర్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు
‘టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో టీమిండియా.. పాక్‌పై 8-1 ఆధిక్యం సాధించడం గొప్ప విషయం. ఇషాన్ కిషన్ సంచలన బ్యాటింగ్ ఆకట్టుకుంది. బుమ్రా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. జై హింద్’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అభినందించారు.
అద్భుతం: బీసీసీఐ సెక్రటరీ
‘పాకిస్థాన్‌పై మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించినందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకు అభినందనలు. పాకిస్థాన్‌పై భారత్ 8-1 ఆధిపత్యం సాధించడం అద్భుతం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా అన్నారు.
గర్వంగా ఉంది: యువీ
‘టీమిండియా ఓ యూనిట్‌గా చేసిన ప్రదర్శనకు నాకు గర్వంగా ఉంది. ప్రశాంతంగా, బలంగా తమ పాత్ర పూర్తి చేశారు’ అని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్