Devdutt Padikkal: సచిన్, కోహ్లీలకు సాధ్యంకాని రికార్డ్.. చరిత్ర సృష్టించిన దేవదత్ పడిక్కల్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:50 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ లో అరుదైన రికార్డును సాధించాడు. సచిన్, కోహ్లీలకు సాధ్యంకాని రికార్డును తన ఖాతాల్లో వేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పడిక్కల్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అరుదైన రికార్డ్ సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సైతం సాధ్యంకాని రికార్డును పడిక్కల్ నమోదు చేశాడు. ఇవాళ(మంగళవారం)రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక తరఫున ఆడుతున్న దేవదత్ పడిక్కల్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇంతకీ ఆ సూపర్ రికార్డ్ ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇవాళ(మంగళవారం) అహ్మదాబాద్ వేదికగా కర్నాటక, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ 82 బంతుల్లో 91 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే, సెంచరీ కోల్పోయినప్పటికీ, పడిక్కల్ ప్రస్తుత సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేశాడు. మూడు వేర్వేరు విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) సీజన్లలో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత్ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ ఘనత సాధించలేదు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ తర్వాత, పడిక్కల్ 38 ఇన్నింగ్స్‌లలో అద్భుతమైన 83.62 సగటుతో లిస్ట్-ఏ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 13 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే...విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్నాటక, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. కర్నాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (107 బంతుల్లో 100 పరుగులు) ఈ టోర్నమెంట్‌లో తన రెండో సెంచరీని సాధించాడు. అలానే పడిక్కల్(Devdutt Padikkal) (82 బంతుల్లో 91) తన ఐదో సెంచరీని కేవలం తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయాడు. ఆ తర్వాత భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (5/36) బంతితో అద్భుతమైన ప్రదర్శన చేసి ఐదు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ 38 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. వరుసగా ఆరో విజయం సాధించిన కర్ణాటక 24 పాయింట్లతో గ్రూప్- బి లో అగ్రస్థానంలో ఉంది. కేరళ, జార్ఖండ్, మధ్యప్రదేశ్ 16 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం పోటీలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్