Shubman Gill Comeback Failure: రీఎంట్రీలో ఘోరంగా విఫలమైన గిల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:45 PM
భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చాలా కాలంగా యాభై ఓవర్ల ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఘోరంగా విఫలమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) చాలా కాలంగా యాభై ఓవర్ల ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కూడా అతని ఈ ఫెయిల్యూర్ కొనసాగింది. ఇవాళ(జనవరి 6) పంజాబ్ తరఫున గోవాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 12 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాక విజయ హజారే ట్రోఫీలో అతడికి ఇదే తొలి మ్యాచ్ కావడం గమన్హారం.
ఆస్ట్రేలియా టూర్‌లో మొదలు..
శుభ్‌మన్ గిల్ గతేడాది అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు. భారత జట్టు వన్డే సారథి హోదాలో తొలిసారి ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన గిల్.. కెప్టెన్సీ అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పెర్త్ వన్డేలో 10, అడిలైడ్ వన్డేలో 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో 24 పరుగులు చేయగలిగాడు. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన వన్డేలకు గిల్ దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా సఫారీలతో మూడు వన్డేలకు దూరంగా ఉన్నాడు. అనంతరం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మూడు టీ20ల్లోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్-2026లో ఆడే భారత జట్టులో గిల్(Shubman Gill) స్థానం కోల్పోయాడు.
రీఎంట్రీలోనూ ఫెయిల్..
ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2025-26)లో ఇవాళ జరిగిన మ్యాచ్‌తోయాభై ఓవర్ల ఫార్మాట్‌లోకి శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇచ్చాడు. గోవాతో మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ విఫలమయ్యాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులే చేసి ఔటయ్యాడు. గోవా బౌలర్ వాసుకి కౌశిక్ బౌలింగ్‌లో ప్రభు దేశాయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, పంజాబ్ సారథి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2 పరుగులు) కూడా విఫలమయ్యాడు. కౌశిక్ బౌలింగ్‌లోనే అతడు కూడా బౌల్డ్ అయ్యాడు. గిల్ విఫలమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది.
రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్(Punjab vs Goa)లో టాస్ ఓడిన గోవా తొలుత బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి 33.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. గోవా బ్యాటర్లలో సూయశ్ ప్రభుదేశాయి (66), లలిత్ యాదవ్ (54) అర్ధ శతకాలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే 3 వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్ సింగ్, సుఖ్‌దీప్ బజ్వా, క్రిష్ భగత్ తలా రెండు వికెట్లు తీశారు. నమన్ ధిర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 35 ఓవర్లలో నాలుగు వికెట్లో కోల్పోయి.. టార్గెట్‌ను చేధించింది.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్