Share News

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ABN , Publish Date - Aug 09 , 2026 | 03:45 PM

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!
Delhi Capitals

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది. డీసీ హెడ్ ఆఫ్ క్రికెట్‌గా గంగూలీ మళ్లీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా యువీ, గంగూలీ ఢిల్లీ శిక్షణ శిబిరంలో కనిపించడంతో సహాయక బృందంలో భారీ మార్పులు ఉండొచ్చన్న వార్తలకు మరింత బలం చేకూరింది.


ఈ శిక్షణ శిబిరంలో యువరాజ్ నెట్స్ వద్దే ఉండి యువ బ్యాటర్లకు సాంకేతిక సూచనలు చేశాడు. ముఖ్యంగా పవర్ హిట్టింగ్ మెరుగుపరుచుకోవడంపై ప్లేయర్లకు సలహాలు ఇస్తూ కనిపించాడు. మరోవైపు గంగూలీ జట్టు కూర్పు, భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి సారించినట్లు సమాచారం. భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా శిబిరంలో పాల్గొని స్థానిక బౌలర్ల ప్రతిభను పరిశీలించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ మాత్రం ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా గంగూలీ మరోసారి జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వ్యూహాత్మక వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇక యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో తొలిసారి బ్యాటింగ్‌ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల కాలంలో యువరాజ్‌ సింగ్ పలువురు యువ బ్యాటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ వంటి ఆటగాళ్లు అతడి సూచనలను ప్రశంసించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ విభాగానికి యువరాజ్‌ మార్గదర్శకత్వం కలిసొస్తుందని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే సీజన్‌ నుంచి జేఎస్‌డబ్ల్యూ సంస్థ పూర్తిస్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో సపోర్ట్‌ స్టాఫ్‌తో పాటు ఆటగాళ్ల ఎంపికలోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఈసారి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ కూడా ఉంది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ నుంచి స్టార్ ప్లేయర్‌ రిషభ్‌ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చే ప్రక్రియను ఫ్రాంచైజీ పూర్తి చేసింది. గంగూలీ వ్యూహాలు.. యువరాజ్‌ బ్యాటింగ్‌ మంత్రాలు.. పంత్‌ నాయకత్వం కలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచకప్‌2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!

తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

Updated Date - Aug 09 , 2026 | 03:45 PM