ప్రపంచకప్2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:30 PM
గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్‌లోనూ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు.
స్పోర్ట్స్ డెస్క్: వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ క్రమంలో భారత వన్డే జట్టును పటిష్ఠంగా ఉంచేందుకు బీసీసీఐ, మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు క్రికెట్ సర్కిల్స్ లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతోన్నాయి. ముఖ్యంగా వన్డేలో అత్యధిక స్కోర్ చేసి.. అసాధారణ రికార్డు కలిగిన రోహిత్ శర్మ ఫామ్ కంటే అతని వయసు, ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్‌లోనూ రోహిత్ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది.
ఈ తరుణంలో రోహిత్ మాజీ సహచరుడు, మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ ఆడబోతున్నాడని స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను' అని రహానే ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చి ఇంటర్యూలో పేర్కొన్నాడు. ఇన్నేళ్లు భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు అద్భుతమని, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో అలాంటి అనుభవజ్ఞుడి సేవలు జట్టుకు కచ్చితంగా అవసరమని ఆయన నొక్కిచెప్పాడు.
'రోహిత శర్మ ప్రపంచ కప్ ఆడతాడని ఒకసారి స్పష్టతనిస్తే సరిపోతుంది. అంతేకూడా ప్రతి సిరీస్‌కు ముందు ఈ చర్చ రాకూడదు. ఎందుకంటే అతడు అంత గొప్ప ఆటగాడు' అంటూ రహానే మద్దతుగా నిలిచారు. క్రికెట్‌లో ఆటగాడికి ఫామ్ చాలా కీలకమని, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ ఆటగాడైనా స్వేచ్ఛగా ఆడగలడని రహానే అభిప్రాయపడ్డాడు. రోహిత్ స్థాయి ఆటగాడి నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఒకవేళ ఆయన 2027 ప్రపంచకప్ ఆడాలని భావిస్తే కచ్చితంగా బరిలోకి దిగాలని స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత
జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!