తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:22 AM
భారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి హాన్‌ను చిత్తుగా ఓడించి.. టైటిల్ కైవసం చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: కొరియా మాస్టర్స్ 300 టోర్నీలో భారత యువ షట్లర్ అస్మిత చాలిహా (Ashmitha Chaliha) అద్భుత ప్రదర్శన చేసింది. తన కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను సాధించింది. ఇవాళ(ఆదివారం) ఆసన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 14-21, 21-14, 21-14 తేడాతో చైనా క్రీడాకారిణి, 35వ ర్యాంకర్ హాన్‌ను చిత్తుగా ఓడించింది. అస్సాంకు చెందిన ఈ26 ఏళ్ల యువ షట్లర్ తొలి గేమ్‌ను కోల్పోయింది. అయితే మిగతా రెండు గేముల్లో అదరగొట్టి.. అద్భుతం చేసింది. కేవలం గంటలోపే విజయం సాధించి.. టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అంతకు ముందు సెమీ ఫైనల్‌లో భారత్‌కే చెందిన రక్షిత రామ్‌రాజ్‌ను ఓడించి అస్మిత ఫైనల్లో ప్రవేశించింది. నిన్న(శనివారం) హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో అస్మిత 21-13, 16-21, 21-13తో రక్షితపై గెలిచింది. తద్వారా తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) టూర్ సింగిల్స్ ఫైనల్‌కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 లేదా అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా అస్మిత నిలిచింది. ప్రపంచ 50వ ర్యాంకర్‌గా ఉన్న అస్మిత గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పార్క్ టే-సాంగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.
ఇవి కూడా చదవండి:
జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!
వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు