Share News

డీఎస్సీపై చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి.. జగన్‌కు మంత్రి సవిత సవాల్!

ABN , Publish Date - Aug 09 , 2026 | 10:50 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు.

డీఎస్సీపై చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి.. జగన్‌కు మంత్రి సవిత సవాల్!
S Savitha

అమరావతి, ఆగస్టు 09: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే రాయలసీమ ప్రాంత ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్లకు.. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని స్పష్టం చేశారు. ఒకరి కష్టాన్ని, ప్రతిభను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని, ఇది గొడ్డలి పార్టీకి హెచ్చరిక అని పేర్కొన్నారు.


అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి సవిత డీఎస్సీ విషయంలో వైసీపీ తీరును తప్పుబట్టారు. డీఎస్సీ 2025 నిర్వహణపై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. దమ్ము, ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్‌కు ఎంతసేపైనా మైక్ ఇచ్చి గౌరవంగా మాట్లాడిస్తామని, అవసరమైతే ఒక రోజంతా మెగా డీఎస్సీపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే సభకు వచ్చి తేల్చుకోవాలని జగన్‌కు సవాల్ చేశారు.


డీఎస్సీ అంటేనే జగన్‌కు మొదటి నుంచి ద్వేషమని ఆరోపించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే, వారందరినీ గొడ్డలి పార్టీ అవమానిస్తోందని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా, పోయినా టీచర్లను అవమానించడమే పనిగా పెట్టుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఉపాధ్యాయుల ఉసురు తగిలితే రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సవిత హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చొక్కాకు చిరుగులు.. కళ్లనిండా నీళ్లు

తిరుమలలో గదుల దందా

Updated Date - Aug 09 , 2026 | 10:50 AM