Share News

చొక్కాకు చిరుగులు.. కళ్లనిండా నీళ్లు

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:33 AM

చిరిగిన చొక్కా.. మాసిన గడ్డం.. చేతిలో సంచితో 90 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. దూరం నుంచి ఆయన్ను గమనించిన ఎమ్మెల్యే దగ్గరికి పిలిపించి వాకబు చేశారు.

చొక్కాకు చిరుగులు.. కళ్లనిండా నీళ్లు

  • రెవెన్యూ సదస్సుకు వచ్చిన 90 ఏళ్ల వృద్ధుడు

  • కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే యరపతినేని

  • తాత ఇంటికి స్వయంగా వెళ్లి సాయం

  • నూతన వస్ర్తాలు, 50 వేల నగదు అందజేత

  • మనవరాలి చదువుకు 3.67 లక్షలు ఇస్తానని మాట

గుంటూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): చిరిగిన చొక్కా.. మాసిన గడ్డం.. చేతిలో సంచితో 90 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. దూరం నుంచి ఆయన్ను గమనించిన ఎమ్మెల్యే దగ్గరికి పిలిపించి వాకబు చేశారు. ఆ పెద్దాయన తన సమస్యలు చెప్పగానే ఎమ్మెల్యే చలించిపోయారు. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే స్వయంగా వృద్ధుడి ఇంటికి వెళ్లి తక్షణ సాయంగా రూ.50 వేలు నగదు, నూతన వస్త్రాలు అందజేశారు. ఆయన మనవరాలి చదువు కోసం మరో రూ.3.67 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ మేరకు ఉదారత చాటుకున్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గురువారం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం గోవిందాపురంలో సదస్సు ఏర్పాటు చేశారు. అక్కడికి పోతురాజు వెంకటేశ్వర్లు(90) వచ్చారు. దయనీయ స్థితిలో ఉన్న ఆయన్ను చూసిన యరపతినేని దగ్గరకు పిలిపించి సమస్య ఏమిటని అడిగారు. తన మనవరాలు నాగమల్లేశ్వరి గుంటూరులో బీటెక్‌ చదువుతోందని, ఫీజు కట్టడానికి డబ్బులు లేవని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగమల్లేశ్వరి తల్లి చనిపోగా, తండ్రి వదిలేసి వెళ్లి పోయాడని, ఇప్పటి వరకు తానే కష్టపడి చదివించానని, ఇప్పుడు శక్తి లేదని బాధపడ్డారు. తాను సహాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పి ఆయన్ను ఇంటికి పంపారు. రెండు రోజుల తర్వాత శనివారం ఎమ్మెల్యేనే గోవిందాపురంలోని వృద్ధుడి ఇంటికి వెళ్లారు.


నాగమల్లేశ్వరి చదువు గురించి పెద్దాయనతో ఆరా తీశారు. గతేడాది, ఈ సంవత్సరం ఫీజు కింద రూ.3.17 లక్షలు కాలేజీకి చెల్లించాలని తెలుసుకుని, ఆ మొత్తం సొమ్మును తానే చెల్లిస్తానని యరపతినేని మాట ఇచ్చారు. ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం రూ.50 వేలు, చిరిగిన దుస్తులతో తన వద్దకు వచ్చిన పెద్దాయనకు రెండు జతల నూతన వస్ర్తాలను అందజేశారు. యరపతినేని గతంలో కూడా నియోజకవర్గంలో వందలాది మంది విద్యార్థులకు ఇదేవిధంగా సాయం చేశారు.

Updated Date - Aug 09 , 2026 | 05:34 AM