Share News

టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:31 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఓ ప్రపంచ రికార్డును సృష్టించింది.

టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
Deepti Sharma record

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. ఈ క్రమంలోనే దీప్తి శర్మ ఒక ప్రపంచ రికార్డు సాధించింది.


మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. గతంలో థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుట్టావాంగ్ (165 వికెట్లు) టాప్ లో ఉండగా.. తాజాగా ఆమె రెండో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) ఉంది. ఇక నాలుగైదు స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్‌చోఫూ (148 వికెట్లు) ఉన్నారు.


ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో భారత్‌కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి ఉంది. ఆమె ఖాతాలో 355 వికెట్లు ఉన్నాయి. 335 వికెట్లతో ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ మూడో స్థానంలో, 332 వికెట్లతో ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.


ఇక మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం దీప్తి మాట్లాడుతూ.. 'ఈ గెలుపు క్రెడిట్ మొత్తం జట్టుకే చెందుతుంది. నా విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణం. ఐసీసీ టోర్నమెంట్లు నాకు ప్రత్యేకమైనవి. ఈ వేదికలపై ఆడటం అంటే నాకు ఇష్టం. అలానే స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై బౌలింగ్ చేయడం నాకు ఎంతో ఇష్టం. ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే నా విజయ రహస్యం' అని దీప్తి వెల్లడించారు.

Updated Date - Jun 15 , 2026 | 12:32 PM