Share News

మా విజయంలో వారిదే కీలక పాత్ర: హర్మన్ ప్రీత్ కౌర్

ABN , Publish Date - Jun 15 , 2026 | 10:57 AM

మ‌హిళ‌ల టీ20 ప్రపంచ‌క‌ప్‌లో ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌కు తోడు స్మృతి మంధాన‌, హ‌ర్మన్ మెరుపుల‌తో పాక్‌పై భార‌త్ ఆధిప‌త్యం ప్రద‌ర్శించింది.

మా విజయంలో వారిదే కీలక పాత్ర: హర్మన్ ప్రీత్ కౌర్
India women vs Pakistan

స్పోర్ట్స్ డెస్క్: మ‌హిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భార‌త జ‌ట్టు బోణీ కొట్టింది. నిన్న(ఆదివారం) బర్మింగ్‌హామ్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 ప‌రుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌కు తోడు లేడీ కోహ్లీ.. స్మృతి మంధాన‌, కెప్టెన్ హ‌ర్మన్ ప్రీత్ మెరుపుల‌తో పాక్‌పై భార‌త్ ఆధిప‌త్యం ప్రద‌ర్శించింది. టీమిండియా విజయంలో స్మృతి, దీప్తి శర్మలదే కీలక పాత్ర అని మ్యాచ్ అనంత‌రం హ‌ర్మన్‌ ప్రీత్ కౌర్ వెల్లడించింది.


టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మ్యాచ్ విజ‌యంలో ఆ ఇద్దరు(స్మృతి మంధాన‌, దీప్తి శ‌ర్మ) కీల‌క‌పాత్ర పోషించారు. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వారిద్దరూ ఎప్పుడూ ముందుంటారు. ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా వాళ్లిద్దరూ ఆడిన తీరు చూసి సంతోషంగా అనిపించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆరంభంలో వికెట్లు ప‌డ‌డంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాం. అనవసరంగా మాపై ఒత్తిడి తెచ్చుకున్నాము. అయితే పిచ్‌పై అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత‌ మంధాన‌, నేను స్వేచ్ఛగా ఆడాం' అని హర్మన్ తెలిపింది.


17 బంతుల్లో 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిచా ఘోష్ గురించి అడగ్గా.. 'రిచా ఘోష్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వొచ్చు. కానీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధమని చెప్పింది. రిచాను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని అనుకున్నాము. అదే స్థానంలో వచ్చిన రిచా.. తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో వాటిని సరిచేసుకుంటాం. నెట్ రన్‌రేట్ అనేది కీలకం కాబట్టి మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తా' అని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

ఉత్కంఠపోరులో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ గెలుపు

వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్‌‌ను వెల్లడించిన కోచ్ మనీష్

Updated Date - Jun 15 , 2026 | 11:02 AM