Share News

భారత్ చేతిలో ఓటమి.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 07:47 AM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ పరాజయంపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.

భారత్ చేతిలో ఓటమి.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కీలక వ్యాఖ్యలు
India vs Pakistan

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తు చేసింది. నిన్న(ఆదివారం) బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ తేడాతో పరాజయాన్ని చవిచూడటంతో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె వెల్లడించింది. రాబోయే మ్యాచుల్లో తమ బ్యాటర్లు కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫాతిమా సనా స్పష్టం చేసింది.


మ్యాచ్ అనంతరం ఫాతిమా సనా మాట్లాడుతూ.. 'ఇన్నింగ్స్ తొలి15 ఓవర్ల వరకు మా బౌలింగ్, ఫీల్డింగ్ మా ప్రణాళికలు బాగానే సాగాయి. కానీ చివరి ఓవర్లలో మేము చాలా అదనపు పరుగులు ఇచ్చేశాం. ఒక దశలో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ కారణంగా ఒక ఫీల్డర్‌ను లోపలికి తీసుకువచ్చాము. అది మాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. రాబోయే మ్యాచ్‌లలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా మెరుగుపరుచుకుంటాం. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడటానికి భారత బ్యాటర్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఒక కారణం కావచ్చు' అని ఫాతిమా సనా చెప్పుకొచ్చింది.


అలానే ఫాతిమా సనా తమ జట్టు ఫీల్డర్లపై అసహనం వ్యక్తం చేసింది. 'క్యాచ్‌లు విడిచిపెడితే మ్యాచ్‌లు గెలవడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మేము చాలా ముఖ్యమైన క్యాచ్‌లను వదిలేశాము. అందులోనూ సీనియర్ ప్లేయర్లే ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధనిపించింది. ఫీల్డింగ్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు మొత్తం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. కాబట్టి మేము ఫీల్డింగ్‌ను కూడా కచ్చితంగా మెరుగుపరుచుకోవాలి' అని ఫాతిమా సనా పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

హడలెత్తించిన మొరాకో

స్పిన్‌తో చిత్తుచేశారు

Updated Date - Jun 15 , 2026 | 08:23 AM