Share News

హడలెత్తించిన మొరాకో

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:13 AM

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌.. ఫిఫా వరల్డ్‌క్‌పను డ్రాతో ఆరంభించగా.. బలమైన స్విట్జర్లాండ్‌ త్రుటిలో విజయాన్ని చేజార్చుకొంది. సెల్ఫ్‌ గోల్‌తో...

హడలెత్తించిన మొరాకో

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

స్వీడన్‌ X ట్యునీషియా

(ఉదయం 7.30)

స్పెయిన్‌ X కేప్‌ వెర్డె

(రాత్రి 9.30)

బెల్జియం X ఈజిప్టు

(అర్ధరాత్రి 12.30)

ఉరుగ్వే X సౌదీ అరేబియా

(మంగళవారం తెల్లవారుజాము 3.30)

ఇరాన్‌ Xన్యూజిలాండ్‌

(మంగళవారం ఉదయం 6.30)

డ్రాతో గట్టెక్కిన బ్రెజిల్‌

1-1 గోల్స్‌తో సమం

స్విట్జర్లాండ్‌కు నిరాశ

సాకర్‌ వరల్డ్‌కప్‌

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌.. ఫిఫా వరల్డ్‌క్‌పను డ్రాతో ఆరంభించగా.. బలమైన స్విట్జర్లాండ్‌ త్రుటిలో విజయాన్ని చేజార్చుకొంది. సెల్ఫ్‌ గోల్‌తో మెగా ఈవెంట్‌లో కతార్‌కు తొలి పాయుంట్‌ అందించింది. ఇక, రెండు పుష్కరాల తర్వాత బరిలోకి దిగిన టర్కీని ఆస్ట్రేలియా చిత్తు చేయగా.. 36 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.

న్యూజెర్సీ: సాంబా టీమ్‌ మ్యాచ్‌ అంటే అంచనాలే వేరు. కానీ, సాకర్‌ వరల్డ్‌క్‌పలో తమ తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నెం:6 బ్రెజిల్‌ ఆశించిన ప్రదర్శనతో ఆకట్టుకోలేక పోయింది. యువ సంచలనం వినీసియస్‌ జూనియర్‌ గోల్‌తో కష్టంగా డ్రాతో గట్టెక్కింది. గ్రూప్‌-సిలో ఆదివారం టాప్‌-10 జట్లయిన బ్రెజిల్‌-మొరాకో మ్యాచ్‌ 1-1తో ముగిసింది. వరల్డ్‌ నెం:7 మొరాకో తరఫున ఇస్మాయిల్‌ సైబరి (21వ నిమిషం) గోల్‌ సాధించగా.. 32వ నిమిషంలో జూనియర్‌ చక్కని లెఫ్ట్‌ఫుట్‌ కిక్‌తో సమం చేశాడు. మ్యాచ్‌ ఆరంభంలో మొరాకో దూకుడు ముందు బ్రెజిల్‌ తడబడింది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఒత్తిడికి గురి చేసిన మొరాకో 21వ నిమిషంలో ఆశించిన ఫలితం సాధించింది. లాంగ్‌ పాస్‌ను అందుకొన్న సైబరి.. బ్రెజిల్‌ కీపర్‌ అలిసన్‌ లైన్‌ నుంచి ముందుకు రావడాన్ని గమనించాడు. డిఫెండర్లు కూడా అడ్డులేకపోవడంతో.. బంతిని టాస్‌ చేసి గోల్‌లో పడేలా చేశాడు. బ్రెజిల్‌ నిర్ఘాంతపోగా.. మొరాకో 1-0 ఆధిక్యం సాధించింది. తేరుకొన్న బ్రెజిల్‌ దాడుల ఉధృతిని పెంచింది. ఈ క్రమంలో 32వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి.


36 ఏళ్ల తర్వాత..

ఫాక్స్‌బరో (మెసాచూసెట్స్‌): సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్‌లో ఆడుతున్న స్కాట్లాండ్‌.. తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో జరిగిన పోరులో స్కాట్లాండ్‌ 1-0తో హైతీపై గెలిచింది. 28వ నిమిషంలో హైతీ పెనాల్టీ ఏరియాలో రీబౌండ్‌ అయిన బంతిని జాన్‌ మెక్‌గిన్‌ పవర్‌ఫుల్‌ కిక్‌తో గోల్‌లోకి పంపాడు. 1990 తర్వాత అంటే.. 36 ఏళ్ల అనంతరం ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్‌ తొలి విజయాన్ని నమోదు చేయడం విశేషం.

కతార్‌కు తొలి పాయింట్‌

శాంటా క్లారా (యూఎస్‌): స్టాపేజ్‌ టైమ్‌లో మిరో ముహీమ్‌ సెల్ఫ్‌ గోల్‌తో.. గెలవాల్సిన మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌ డ్రాతో సరిపెట్టుకుంది. గ్రూప్‌-బిలో కతార్‌-స్విస్‌ మధ్య జరిగిన ఈ పోరు 1-1తో డ్రాగా ముగిసింది. 17వ నిమిషంలో పెనాల్టీని బ్రీల్‌ ఎంబోలస్‌ గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరిదాకా ఇదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొంది. అయితే, 90+4వ నిమిషంలో స్విస్‌ ప్లేయర్‌ ముహీమ్‌ హెడర్‌తో బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. దీంతో 1-1తో స్కోరు సమం చేసిన కతార్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలి పాయింట్‌ దక్కించుకొంది.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 06:13 AM