Share News

యుద్ధభూమిలో అభివృద్ధి బాటలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:53 AM

కఠిన భౌగోళిక పరిస్థితులతోపాటు సరిహద్దు ఉద్రిక్తతల వల్ల కాల్పుల మోతతో దద్దరిల్లిన జమ్మూ-కశ్మీర్‌, శ్రీనగర్‌ ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.

యుద్ధభూమిలో అభివృద్ధి బాటలు

  • జమ్మూ-కశ్మీర్‌ నుంచి శ్రీనగర్‌- లేహ్‌ వరకు.. రహదారుల విస్తరణ, వంతెనలు, సొరంగాల నిర్మాణం

  • రూ.51,118.01 కోట్లతో దాదాపు 1200కిలోమీటర్ల పనులు చేపట్టిన కేంద్రం

  • జమ్ము, శ్రీనగర్‌ పట్టణాలకు ప్రత్యేక బైపాస్‌, రింగురోడ్లు

  • ఎన్‌హెచ్‌-144ఏ, ఎన్‌హెచ్‌-244, ఎన్‌హెచ్‌-301, ఎన్‌హెచ్‌-44పై దృష్టి

  • శ్రీనగర్‌-లద్దాక్‌ కనెక్టివిటీలో కీలకంగా సోన్‌మార్గ్‌, నీల్‌గ్రార్‌, జోజిలా పాస్‌ టన్నెల్స్‌

(కశ్మీర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి) జూన్‌ 14 : కఠిన భౌగోళిక పరిస్థితులతోపాటు సరిహద్దు ఉద్రిక్తతల వల్ల కాల్పుల మోతతో దద్దరిల్లిన జమ్మూ-కశ్మీర్‌, శ్రీనగర్‌ ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. యుద్ధ భూములుగా పేరొందిన జమ్మూ, కశ్మీర్‌, శ్రీనగర్‌, జోజిలా, కార్గిల్‌, లద్దాక్‌, లేహ్‌, పుల్వామా సహా మరికొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఐదారేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ.51,118.01కోట్లతో దాదాపు 1,200కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, వంతెనలు, టన్నెల్స్‌(సొరంగాల) నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తవ్వగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. 4.85 కిలోమీటర్ల మేర చేపట్టిన పుల్వామా బైపా్‌సను ఇటీవలే పూర్తి చేశారు. జాతీయ రహదారి (ఎన్‌.హెచ్‌)-301లోని కార్గిల్‌-జన్స్‌కర్‌ మధ్యన రూ.3,102.71కోట్లతో సుమారు 225 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ నుంచి శ్రీనగర్‌ వరకు ఉన్న ఎన్‌హెచ్‌-144ఏ, ఎన్‌హెచ్‌-244, ఎన్‌హెచ్‌-301, ఎన్‌హెచ్‌-44లపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రయాణాలకే కాక దేశ రక్షణకు కూడా కీలకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. కశ్మీర్‌ నుంచి లేహ్‌ వరకు సైనిక దళాల రాకపోకల్లో వేగం పెరగడంతోపాటు, సరిహద్దు ప్రాంతాలకు దళాలు చేరుకునేందుకు సమయం తగ్గుతుందని చెబుతోంది. అలాగే, ఈ ప్రాజెక్టులు లద్దాక్‌-కార్గిల్‌-కశ్మీర్‌ లోయలను అన్ని కాలాల్లో అనుసంధానం చేయనున్నాయి. ఈ పనులు ఢిల్లీ, శ్రీనగర్‌ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాక జమ్మూ-కశ్మీర్‌ పర్యాటకానికి, ఆయా ప్రాంతాల ఆర్థిక ప్రగతికి మరింత ఊతమిస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి పనులను నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌),నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్ర రవాణా-రోడ్డు మంత్రిత్వ శాఖ(మోర్త్‌) పరిధిలో చేపట్టారు.


కొండలు, మంచు పర్వతాల మధ్యన రోడ్లు

జమ్మూ-కశ్మీర్‌ నుంచి శ్రీనగర్‌ -లేహ్‌ వరకు ఎటుచూసిన కొండలు, మంచు పర్వతాలే. ప్రస్తుతం దాదాపు వేల కిలోమీటర్ల ఎత్తులో నిర్మించిన ఘాట్‌ రోడ్డులపై వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఏ మాత్రం పట్టుతప్పినా వాహనాలు లోయలో పడి అందులోని మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. కేంద్రం అలాంటి ప్రాంతాల్లోనే రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో ఎత్తైన కొండలు, మంచు పర్వతాలను తొలుస్తూ టన్నెల్స్‌ను నిర్మిస్తోంది. ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ జమ్మూ పరిధిలో దాదాపు రూ.6,087.31కోట్లతో దాదాపు 182.87కిలోమీటర్ల పనులను చేపట్టింది. ఇందులో ఎన్‌హెచ్‌-144ఏ మార్గంలో జమ్మూ- అక్నుర్‌ మధ్యన చినాబ్‌ నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. అలాగే, ఎన్‌హెచ్‌-244 మార్గంలోని 135.75కి.మీ మేర చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తవ్వగా మిగిలినవి శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ పరిధిలో ‘లేహ్‌’ (కార్గిల్‌-లద్దాక్‌ మధ్యన) ప్రాంతంలో ప్రత్యేక కారిడార్‌ కింద పనులను చేపట్టారు. వాస్తవానికి సోన్‌మార్గ్‌ దాటిన తరువాత వచ్చే జోజిలా-ద్రాస్‌, కార్గిల్‌-లద్దాక్‌-లేహ్‌ ప్రాంతాలన్నీ వార్‌బెల్ట్‌గా ఉన్నాయి. జోజిలా, కార్గిల్‌లో యుద్ధాల్లో మరణించినవారి కోసం ‘స్మారక స్థూపాలు’ కూడా నిర్మించారు. అలాంటి ఎన్‌హెచ్‌-301 (కార్గిల్‌-జన్సకర్‌ సెక్షన్‌) మార్గంలో ఇప్పుడు దాదాపు రూ.3,102 కోట్లతో సుమారు 225 కిలోమీటర్ల అభివృద్ధి పనులను చేపట్టారు. సోన్‌మార్గ్‌ నుంచి లేహ్‌ వరకు వెళ్లాలంటే దాదాపు 11వేల అడుగులఎత్తులో ఉండే ఘాట్‌ రోడ్లపైనే ప్రయాణం చేయాలి. మార్గమధ్యలో ఎన్నో మూలమలుపులు ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ మార్గంలో టన్నెల్స్‌ నిర్మిస్తుండగా, కొన్నిచోట్ల బ్రిడ్జిలను, మరికొన్ని చోట్ల రోడ్లను రెండు, నాలుగు లేన్లతో వెడల్పు చేస్తున్నారు. వీటిలో కొన్ని పనులు తుది దశకు చేరాయి.

జమ్మూలో కీలకంగా డీఏకే ఎక్స్‌ప్రెస్‌వే

ఎన్‌హెచ్‌ఏఐ జమ్మూ పరిధిలో దాదాపు రూ.21,349.7కోట్లతో సుమారు 234.42కిలోమీటర్ల పనులను చేపట్టింది. ఇందులో డీఏకే ఎక్స్‌ప్రెస్‌ వే (బాల్సువా-పటాన్‌కోట్‌ నుంచి హిరానగర్‌-కథువా వరకు)ను కొన్ని ప్యాకేజీలుగా విభజించి ప్రత్యేకంగా పనులు నిర్వహిస్తున్నారు. ఎన్‌హెచ్‌-44 మార్గంలో రూ.3,929కోట్లతో దాదాపు 14కిలోమీటర్ల అభివృద్ధి పనులు చేపట్టారు. శ్రీనగర్‌ నగర పరిధిలో రూ.4,932కోట్లతో 78.8కి.మీ మేర నాలుగు లేన్లతో బైపా్‌స/రింగురోడ్డును నిర్మిస్తున్నారు.


ప్యాకేజీలతో అక్నూర్‌-పూంచ్‌ రోడ్డు అభివృద్ధి

జమ్మూలోని ఎన్‌హెచ్‌-144ఏ మార్గంలో అక్నూర్‌-పూంచ్‌ రోడ్డు 168.18కి.మీలను 8 ప్యాకేజీ లుగా విభజించి మోర్త్‌ పరిధిలో పనులు నిర్వహిస్తున్నారు. దీని కోసం రూ.4,318.76 కోట్లను వెచ్చిస్తున్నారు. శ్రీనగర్‌- బారాముల్లా-ఉరి (ఎస్‌బీయు) ఎన్‌హెచ్‌-1 మార్గంలో 91.5 కిలోమీటర్ల మేర రోడ్డును రూ.3,498.2కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. రఫియాబాద్‌-కుప్వారా-చట్టోరి (ఆర్‌కేసీటీసీ) ఎన్‌హెచ్‌-701 మధ్యన కూడా 113కిలోమీటర్ల మేర పనులను చేపట్టారు. ఇవీకాక కుల్గామ్‌ బైపాస్‌, షోపియన్‌ బైపాస్‌, పరింపోర జంక్షన్‌, పంద్రా్‌స-పశ్యకున్‌(ఎన్‌హెచ్‌-1, జోజిలా-కార్గిల్‌) మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే లద్దాక్‌ రూట్‌లో రూ.2716కోట్లతో సోన్‌మార్గ్‌ టన్నెల్‌ నిర్మించారు. నీల్‌గ్రార్‌ టన్నెల్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం జోజిలాపాస్‌ దగ్గర 14 కిలోమీటర్ల భారీ టన్నెల్‌ నిర్మాణం జరుగుతోం కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల ఫైనల్‌ బ్రేక్‌త్రూ(ఇరువైపులా తొలచిన సొరంగాన్ని అనుసంధానించే ప్రక్రియ) నిర్వహించారు. 2028 ఫిబ్రవరిలో జోజిలా టన్నెల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ పనులు నిర్వహిస్తోంది.

Updated Date - Jun 15 , 2026 | 03:53 AM