జహీర్ ఖాన్ మాత్రమే కాదు.. చాలామంది కోచ్‌లతో సీఎస్కే చర్చలు: అశ్విన్
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:34 PM
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే జహీర్ ఎంపికకు ముందు పలువురు మాజీ క్రికెటర్ల పేర్లను సీఎస్కే యాజమాన్యం పరిశీలించినట్లు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. గుజరాత్ టైటాన్స్ (GT) కోచ్‌గా ఉన్న మరో భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా పేరు కూడా ఒక దశలో పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు.
‘చాలా మంది కోచ్‌లతో సీఎస్కే చర్చలు జరిపింది. నాకు తెలిసినంతవరకు ఒక దశలో ఆశిష్ నెహ్రా పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో నెహ్రా విజయవంతంగా కొనసాగుతున్నాడు. అలాంటి సమయంలో అతడు ఆ జట్టును వీడాల్సిన అవసరం లేదు. ఇద్దరు భారత మాజీ దిగ్గజాలతో పాటు పలువురు విదేశీ కోచ్‌ల పేర్లను కూడా సీఎస్కే పరిశీలించింది. అయితే వివిధ కారణాలతో కొన్ని ఒప్పందాలు కుదరలేదు. కొందరు కోచ్‌లు కేవలం ఏడాది ఒప్పందానికి సిద్ధంగా లేకపోవడం వల్ల చర్చలు ముందుకు సాగలేదు’ అని అశ్విన్ వెల్లడించాడు.
జహీర్ ఎంపికపై ప్రశంసలు
జహీర్ ఖాన్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంపై అశ్విన్ సానుకూలంగా స్పందించాడు. జహీర్‌కు క్రికెట్‌పై మంచి అవగాహనతో పాటు బౌలింగ్ వ్యూహాలపై పట్టు ఉందని పేర్కొన్నాడు. ‘జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడం అద్భుతమైన నిర్ణయం. అతడు అన్ని అంశాల్లోనూ సరిపోతాడు. తెలివైన వ్యక్తి. క్రికెట్ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా బౌలింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉంది. ఆటగాళ్లతో కూడా చక్కగా కలిసిపోగలడు. మరోవైపు ధోనీతో జహీర్‌కు మంచి సంబంధం ఉంది. అతడు యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయగలడు. హెడ్ కోచ్‌గా జహీర్‌కు ఇది కొత్త ఆరంభం. అయితే ధోనీతో అతడి అనుబంధం కారణంగా జట్టు ఒకే దిశలో ముందుకు సాగుతుందని భావిస్తున్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2027 వేలానికి వేదిక ఖరారు.. ఎక్కడో తెలుసా?
జపాన్‌లో బుమ్రా స్పెషల్ షాపింగ్.. భార్య సంజన రియాక్షన్ వైరల్