ఆసియా క్రీడలు: 13 ఏళ్లకే చైనా అథ్లెట్ సంచలనం.. ఏకంగా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:37 PM
చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యూ జిడీ ఆసియా క్రీడల్లో అదరగొడుతోంది. జపాన్ వేదికగా జరుగుతున్న పోటీల్లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యూ జిడీ ఆసియా క్రీడల్లో అదరగొడుతోంది. జపాన్ వేదికగా జరుగుతున్న పోటీల్లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో యూ జిడీ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ క్రమంలో ఆసియా క్రీడల రికార్డును కూడా బద్దలు కొట్టింది.
యూ జిడీ 4 నిమిషాల 28.56 సెకన్లలో రేసును పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. 2014లో చైనాకే చెందిన యే షివెన్ పేరిట ఉన్న రికార్డును దాదాపు 4.5 సెకన్ల తేడాతో అధిగమించింది. ఈ క్రీడల్లో ఆమె పాల్గొన్న మూడు వ్యక్తిగత ఈవెంట్లలోనూ స్వర్ణాలు సాధించడం విశేషం. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలోనూ యూ జిడీ గేమ్స్ రికార్డులతోనే పసిడి పతకాలు గెలిచింది.
వాటర్ పార్క్ నుంచి.. ప్రపంచ వేదిక వరకు..
యూ జిడీ ప్రతిభకు సంబంధించిన కథ కూడా ఆసక్తికరమే. ఓ వాటర్ పార్క్‌లో ఈత కొడుతున్న సమయంలో ఆమెను ఓ స్విమ్మింగ్ కోచ్ అనుకోకుండా గుర్తించాడు. ఆ తర్వాత ఆమెకు శిక్షణ ఇప్పించడంతో క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. అయితే ఈ 13 ఏళ్ల చిన్నారి కేవలం తన ప్రదర్శనతోనే కాదు.. ఇంటర్వ్యూలతోనూ చైనాలో వైరల్‌గా మారుతోంది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఆమెకు అంతగా ఇష్టం లేదట. ఈ విషయంపై అడిగినప్పుడు నవ్వుతూ.. ‘ప్రతిసారీ ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది’ అంటూ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం
మెడల్ మిస్.. జస్పాల్ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం