Share News

ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:56 PM

ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. టీమ్ ఈవెంట్‌లో పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. సెమీ ఫైనల్‌లో చైనా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి పాలైంది.

ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం
India Badminton Team

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. టీమ్ ఈవెంట్‌లో పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. సెమీ ఫైనల్‌లో చైనా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయిన భారత్.. కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే వరుసగా ఆసియా క్రీడల్లో భారత్ రెండోసారి పతకం సాధించడం విశేషం. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ రజతం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడూ ఫైనల్లో చైనా చేతిలోనే ఓడింది. 1982, 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన తర్వాత.. 40 ఏళ్లకు మళ్లీ వరుస ఆసియా గేమ్స్‌ల్లో పతకాలు సాధించి భారత బ్యాడ్మింటన్ జట్టు అరుదైన ఘనత సాధించింది.


ప్రపంచ 14వ ర్యాంకర్‌ లక్ష్యసేన్‌ తొలి సింగిల్స్‌లో చైనా ఆరో ర్యాంకర్‌ షి యూకీని ఎదుర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో లక్ష్య తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస గేముల్లో 16-21, 18-21తో ఓటమి పాలయ్యాడు. దీంతో చైనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఓటమితో వెనుకబడిన భారత్‌ను సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆదుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేతలు, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు లియాంగ్‌ వెయ్‌ కెంగ్‌-వాంగ్‌ చాంగ్‌తో తలపడిన భారత జోడీ అద్భుతంగా ఆడింది. 21-11, 22-20తో ప్రత్యర్థి జోడీని ఓడించి భారత్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఫైనల్‌ ఆశలు చిగురించాయి. మూడో మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆయుశ్ శెట్టి బరిలోకి దిగాడు. ప్రపంచ 12వ ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌తో తలపడిన ప్రపంచ 20వ ర్యాంకర్‌ ఆయుశ్.. గట్టి పోటీనిచ్చినా విజయం అందుకోలేకపోయాడు. 19-21, 13-21 తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో చైనా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.


రెండో డబుల్స్‌లోనూ చైనాదే పైచేయి

భారత్‌ ఫైనల్‌ ఆశలు హరిహరన్‌ అంసకరుణన్‌-ఎంఆర్‌ అర్జున్‌ జోడీపై నిలిచాయి. ప్రపంచ 25వ ర్యాంకులో ఉన్న ఈ జోడీ.. హీ జీ టింగ్‌-లియు యీ జంటతో తలపడింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో పుంజుకుని 21-17తో గెలిచింది. అయితే నిర్ణాయత్మక మూడో గేమ్‌లో చైనా జోడీ ఆధిపత్యం ప్రదర్శించింది. 9-21తో భారత జోడీ ఓటమి పాలైంది. దీంతో చైనా 3-1తో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: క్రికెటర్ అవ్వాలనుకుని.. సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు!

ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు

Updated Date - Sep 23 , 2026 | 04:56 PM