ఆసియా క్రీడలు: క్రికెటర్ అవ్వాలనుకుని.. సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు!
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:25 PM
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 24 ఏళ్ల జై మీనా ఇప్పుడు భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జై మీనా.. చిన్నప్పుడు క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ అనుకోకుండా ఆడిన సాఫ్ట్ టెన్నిస్ అతడి జీవితాన్నే మార్చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 24 ఏళ్ల జై మీనా ఇప్పుడు భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. గెలిచింది కాంస్యమే అయినా.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించాడు.
బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగంలో మీనా కాంస్య పతకం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఫిలిప్పీన్స్ ప్లేయర్‌పై అద్భుతంగా పోరాడి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో జపాన్ ఆటగాడు టకుయా కురోసాకా చేతిలో 4-2 తేడాతో ఓడటంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మీనా ఓ దశలో పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత వరుస సెట్లలో వెనుకబడ్డాడు. కాంస్య పతకం సాధించినప్పటికీ సాఫ్ట్ టెన్నిస్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేశాడు.
క్రికెటర్ అవ్వాలనుకుని..
చిన్నతనంలో పయనీర్ పబ్లిక్ స్కూల్‌లో సాఫ్ట్ టెన్నిస్ ఆటను తొలిసారి చూసిన మీనా.. తొలుత ఆసక్తితో కోర్టు వద్ద నిల్చుని ఆటను గమనించేవాడు. ఆ తర్వాత బాల్‌బాయ్‌గా పనిచేశాడు. అప్పుడే క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కంటున్న అతడిని ఈ ఆట ఎంతగానో ఆకట్టుకుంది. ఆటగాళ్లు కొట్టిన బంతులను అందిస్తూ.. వారిని చూస్తూ క్రమంగా ఈ సాఫ్ట్ టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. చివరకు అదే ఆటను కెరీర్‌గా మార్చుకుని ఇప్పుడు దేశం గర్వించేలా చేశాడు. 2022 ఆసియా క్రీడల్లో మీనా సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ వరకు వెళ్లాడు. ఈసారి మరో అడుగు ముందుకేసి సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. ఈ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్‌డ్ ఈవెంట్లలో మెడల్ రౌండ్‌కు చేరిన ఏకైక భారత ఆటగాడిగానూ నిలిచాడు. మరో భారత ఆటగాడు ఆర్యన్ ఠాకూర్ గ్రూప్ దశలోనే నిష్క్రమించాడు.
జాతీయ స్థాయి నుంచి ప్రపంచ వేదిక వరకు..
జై మీనా ఎదుగుదల ఒక్క రోజులో జరిగింది కాదు. 2022లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. 2025లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ వరుసగా రికార్డులు నెలకొల్పాడు. 2024 ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఆదియా తివారీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. ఆ తర్వాత 2025 ఆసియా సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో కలిపి నాలుగు పతకాలు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు