Share News

మెడల్ మిస్.. జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:20 PM

ఆసియా క్రీడల్లో పతకం చేజారడంతో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ తీవ్ర నిరాశకు గురైంది. మ్యాచ్ అనంతరం మాజీ కోచ్‌, గురువు జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది.

మెడల్ మిస్.. జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం
Manu Bhaker

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పతకం చేజారడంతో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ తీవ్ర నిరాశకు గురైంది. మ్యాచ్ అనంతరం మాజీ కోచ్‌, గురువు జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. జపాన్ వేదికగా బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో మను భాకర్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.


జస్పాల్‌ రాణా గుండె సంబంధిత సమస్యలతో ఈ ఏడాది జూన్‌లో 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత మను భాకర్‌ పాల్గొన్న తొలి మెగా క్రీడా పోటీ ఇదే. మను కెరీర్‌లో రాణా కీలక పాత్ర పోషించారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించడంలో ఆయన మార్గదర్శకత్వం ఎంతో కీలకమైంది.


ఆ పాఠాలు ఎప్పటికీ గుర్తుంటాయి..

‘మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి దూరమైతే.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఆయన నేర్పిన పాఠాలు మర్చిపోయేవి కాదు. ఫలితం గురించి కాకుండా ప్రక్రియపై దృష్టి పెట్టాలన్నదే నా గురువు నాకు నేర్పిన ప్రధాన పాఠం. ఏ రోజు షూటింగ్‌ చేసినా.. జీవితంలో ఏ దశలో ఉన్నా.. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని జస్పాల్ రాణా ఎప్పుడూ చెప్పేవారు. ఈ పోటీలో మెరుగ్గా రాణించలేకపోయా. అదే నా పతక అవకాశాలను దెబ్బతీసింది. జపాన్‌లో పోటీకి ముందు కూడా సన్నాహకాలు సజావుగా సాగలేదు. మంగళవారం ప్రీ-ట్రైనింగ్ సెషన్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పోటీలో పాల్గొన్నా’ అని మను వెల్లడించింది.


జస్పాల్ ఉండుంటే..

భారత షూటింగ్‌లో జస్పాల్‌ రాణాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆసియా క్రీడల్లో మూడు ఎడిషన్లలో కలిపి ఆయన ఎనిమిది పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలు ఉన్నాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో రాణా తనకు ఎంతో మార్గదర్శకత్వం వహించారని మను గుర్తు చేసుకుంది.


‘ఆయన ఆసియాలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకరు. 2018 జకార్తా ఆసియా క్రీడలకు వచ్చినప్పుడు ఆయన తిరుగులేని ఛాంపియన్‌గా ఉన్నారు. జపాన్‌లో కూడా ఆయన మార్గదర్శకత్వంలో పోటీ పడాలని ఎంతో ఎదురుచూశాను. జీవితం చాలా అనూహ్యమైనది. ఆయన ఉండుంటే ఫలితం మరోలా ఉండేదేమో! అయినప్పటికీ భోపాల్‌లో ఆసియా క్రీడల ముందు నిర్వహించిన సిమ్యులేటెడ్‌ ఫైనల్స్‌తో పోలిస్తే.. నగోయా ఫైనల్లో నా ప్రదర్శన కొంత మెరుగ్గా ఉంది. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించగలననే నమ్మకం ఉంది. ఇంకా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తా. మీకు కనిపించేది నేను మాత్రమే. కానీ మా ప్రదర్శన కోసం ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు. కోచ్‌ జెలెనా ఎంతో శ్రమించారు. ప్రతి విషయంలో ఎంతో ఓపికగా వ్యవహరించారు. నా కోసం కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు’ అని మను తెలిపింది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: క్రికెటర్ అవ్వాలనుకుని.. సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు!

ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు

Updated Date - Sep 23 , 2026 | 04:25 PM