బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన జింబాబ్వే
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:43 PM
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైన బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది.
స్పోర్ట్స్ డెస్క్: సొంతగడ్డపై పాకిస్థాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ కు జింబాబ్వే పర్యటనలో ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ ఓటమిపాలైన బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. ఇవాళ(సోమవారం) హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాపై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లతో జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. జింబాబ్వేను స్వల్ప స్కోర్కే పరిమితం చేయడంలో నహీద్ రానా కీలక పాత్ర పోషించాడు. మరో బౌలర్ తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో 3వికెట్లు సాధించారు. అలానే ఐపీఎల్ స్టార్ ప్లేయర్ బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 9న జరగనుంది.
ఇవి కూడా చదవండి:
సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే సిరీస్ నుంచి ఔట్!
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ