సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే సిరీస్ నుంచి ఔట్!
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:35 PM
భారత టీ20 జట్టులో కేరళ స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్‌కు.. మరో బిగ్ షాక్ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత టీ20 జట్టులో కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్‌కు.. తాజాగా జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన భారత జట్టులో కనీసం చోటే దక్కలేదు. జూలై 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి అతడిని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు.
సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనల్లో సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను పరీక్షిస్తుంటారు. అయితే, ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే వంటి సీనియర్, యువ బ్యాటర్లందరినీ జింబాబ్వేకు ఎంపిక చేసినప్పటికీ.. కేవలం శాంసన్‌ను మాత్రమే తొలగించడం గమనార్హం. ఐర్లాండ్ సిరీస్‌తో పాటు, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ వరుసగా విఫలం కావడమే శాంసన్‌పై వేటుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అతని స్థానంలో పంజాబ్ యువ కీపర్ ప్రభుసిమ్రాన్ సింగ్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేశారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జింబాబ్వే సిరీస్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు సూర్యాన్ష్ షెడ్గే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్‌లకు చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లకు విశ్రాంతినిచ్చి.. ఐపీఎల్ స్టార్ మయాంక్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ, యష్ ఠాకూర్‌లను ఎంపిక చేశారు. అలాగే ఫినిషర్ రింకూ సింగ్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభుసిమ్రాన్ సింగ్ (కీపర్).
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు