యువ భారత్‌ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ!
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:50 PM
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో సోమవారం జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. మహింద రాజపక్ష అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. లంక బౌలర్ల ధాటికి కేవలం 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన 17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్, అర్జున్ రాజ్‌పుత్ (76 పరుగులు) కలిసి జట్టును అద్భుతంగా ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తండ్రి శైలికి భిన్నంగా అన్వయ్ ద్రవిడ్ వన్డేల్లో టీ20 తరహాలో దూకుడుగా ఆడాడు. కేవలం 67 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, ఒక సిక్సర్లు ఉన్నాయి. అలానే కేవలం 47 బంతుల్లోనే కెరీర్‌లో తొలి యూత్ వన్డే అర్ధశతకాన్ని అందుకున్నాడు అన్వయ్. ఈ క్రమంలోనే శతకం దిశగా దూసుకుపోతుండగా లంక పేసర్ గింహాన్ మెండిస్ బౌలింగ్‌లో అన్వయ్ ఔటయ్యాడు. అనంతరం భారత లోయర్ ఆర్డర్ తడబడటంతో టీమిండియా 47.2 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మెండిస్ 5 వికెట్లతో రాణించాడు.
ఇటీవలే వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 220 పరుగులు చేసిన అన్వయ్, రాబోయే అండర్-19 ప్రపంచకప్ రేసులో బలంగా దూసుకుపోతున్నాడు. కాగా, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా ఇదివరకు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత్ యూత్ జట్టుకు ఎంపికైనప్పటికీ, మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు
ఆసీస్ నిలకడే ఆ జట్టును విజేతగా నిలిపింది: సచిన్