ప్రధాని నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన ప్రారంభం..
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:21 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (సోమవారం) ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు బయలుదేరారు. జులై 6 నుంచి 11 వరకు కొనసాగనున్న ఈ ఆరు రోజుల పర్యటనలో ఆయా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (సోమవారం) ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు బయలుదేరారు. జులై 6 నుంచి 11 వరకు కొనసాగనున్న ఈ ఆరు రోజుల పర్యటనలో ఆయా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
అలాగే భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్‌కు మరింత బలం చేకూరుస్తాయని ఆయన తెలిపారు. స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణంపై భారత్ నిబద్ధతను ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇండోనేషియా పర్యటన..
ప్రధాని మోదీ జులై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ నాలుగోసారి ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. జకార్తాలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం భారతీయ ప్రవాసులను ఉద్దేశించి భారీ సభలో ప్రసంగించనున్నారు. అలాగే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించనున్నారు.
మెల్‌బోర్న్‌లో ఆల్బనీస్‌తో భేటీ..
ఇండోనేషియా పర్యటన అనంతరం జులై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే ఆ దేశ గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో పాల్గొని ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతీయ ప్రవాసులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు.
దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌కు..
ఆస్ట్రేలియా పర్యటన అనంతరం జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగనుంది. మరోవైపు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌ను సందర్శిస్తున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలవనున్నారు. ఆక్‌లాండ్‌లో ప్రధాని లక్సన్‌తో సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ద్వైపాక్షిక సహకారం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ రంగాల్లో నమోదైన పురోగతిని సమీక్షించనున్నారు. అదే సమయంలో ప్రముఖ వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత భారతీయ ప్రవాసులను ఉద్దేశించి భారీ సభలో ప్రసంగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం.. మెటాకు మూడు రోజుల గడువు పెంపు..