Share News

విరాట్ ఖాతాలో మరో అరుదైన చెత్త రికార్డు

ABN , Publish Date - May 11 , 2026 | 09:52 AM

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

విరాట్ ఖాతాలో మరో అరుదైన చెత్త రికార్డు
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.


ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. దీప‌క్ చాహ‌ర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశ‌గా ఆడే ప్రయ‌త్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న రాజ్‌బ‌వాకు అద్భుతమైన క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో ఈ సీజ‌న్‌లో తొలిసారి గోల్డెన్ డ‌క్ అయిన కోహ్లీకి ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఎనిమిదో గోల్డెన్‌ డకౌట్‌ కావడం విశేషం. అంతేకాదు ఈ సీజన్‌లో వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.


త‌ద్వారా నాలుగేళ్ల త‌ర్వాత రెండు వ‌రుస మ్యాచ్‌ల్లో డ‌కౌటైన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. ల‌ఖ్‌నవూతో జ‌రిగిన గ‌త మ్యాచ్‌లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. ఐపీఎల్‌ల్లో అత్యధిక సార్లు గోల్డెన్‌డ‌క్ అయిన ఆట‌గాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిష‌న్‌, సునీల్ న‌రైన్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. వీరి కంటే ముందు ర‌షీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్‌వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

ఉర్విల్‌.. ఉరుమల్లే!

ముంబై అవుట్‌

Updated Date - May 11 , 2026 | 10:43 AM