Share News

ఉర్విల్‌.. ఉరుమల్లే!

ABN , Publish Date - May 11 , 2026 | 02:39 AM

6,6,6.. 6,6,6,4..6.. ఇలా ఎదురొచ్చిన ప్రతి బంతినీ బౌండరీకి తరలిస్తూ ఛేదనలో ఉప్పెనలా విరచుకుపడ్డ ఉర్విల్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 65) రికార్డుస్థాయిలో 13 బంతుల్లోనే...

ఉర్విల్‌.. ఉరుమల్లే!

నేటి మ్యాచ్‌

పంజాబ్‌ X ఢిల్లీ

వేదిక : ధర్మశాల, రా.7.30

13 బంతుల్లోనే అర్ధ శతకం

  • జైస్వాల్‌ రికార్డు సమం

  • చెన్నై విజయం

  • లఖ్‌నవూ ఇంటికి

చెన్నై: 6,6,6.. 6,6,6,4..6.. ఇలా ఎదురొచ్చిన ప్రతి బంతినీ బౌండరీకి తరలిస్తూ ఛేదనలో ఉప్పెనలా విరచుకుపడ్డ ఉర్విల్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 65) రికార్డుస్థాయిలో 13 బంతుల్లోనే అర్ధ శతకం బాదగా.. అంతకుముందు ఓవర్టన్‌ (3/36) తనదైన బౌలింగ్‌తో కీలక బ్యాటర్లకు కళ్లెం వేయడంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్లతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను చిత్తుచేసి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇన్‌గ్లి్‌స (33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 85), షాబాజ్‌ అహ్మద్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 నాటౌట్‌) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఛేదనలో చెన్నై 19.2 ఓవర్లలో 208/5 స్కోరు చేసి గెలిచింది. ఉర్విల్‌ తర్వాత కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42)ది టాప్‌స్కోర్‌. సంజూ శాంసన్‌ (14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) రాణించాడు. దిగ్వేష్‌, షాబాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఓవర్టన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ ఓటమితో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. 11 మ్యాచుల్లో 3 విజయాలు, 8 ఓట ములు నమోదు చేసిన పంత్‌ సేన కేవలం 6 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.

ఉర్విల్‌ విధ్వంసం..: ఛేదనలో చెన్నై ఓపెనర్లు సంజూ శాంసన్‌, రుతురాజ్‌ తొలి వికెట్‌కు 45 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. నాలుగో ఓవర్‌లో సంజూను దిగ్వేష్‌ అవుట్‌ చేయడంతో క్రీజులోకి వచ్చిన ఉర్విల్‌ పటేల్‌.. లఖ్‌నవూ బౌలర్లను ఊచకోత కోశాడు. ఐదో ఓవర్‌లో అవేశ్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదిన పటేల్‌.. తర్వాతి ఓవర్‌లో మరో 3 సిక్స్‌లు, ఫోర్‌ సాధించాడు. ఆ వెంటనే మరో సిక్స్‌ కొట్టిన ఉర్విల్‌.. 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉర్విల్‌ ఇచ్చిన క్యాచ్‌ను దిగ్వేశ్‌ మిస్‌ చేశాడు. ఆ వెంటనే పదో ఓవర్లో షాబాజ్‌ బౌలింగ్‌లో అవేశ్‌కు ఉర్విల్‌ చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, ఫిఫ్టీ దిశగా సాగుతున్న రుతురాజ్‌ను 13వ ఓవర్లో షాబాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. బ్రేవిస్‌ (10), కార్తీక్‌ (20) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చివరి 3 ఓవర్లలో 30 రన్స్‌ కావాల్సి ఉండడంతో.. చెన్నై సులువుగానే గెలుస్తుందనుకున్నా శివం దూబే (15 నాటౌట్‌), ప్రశాంత్‌ వీర్‌ (17 నాటౌట్‌) పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే, చివరి ఓవర్‌లో గెలుపునకు 10 రన్స్‌ అవసరమవగా.. దూబే రెండు సిక్స్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.


దంచేసిన ఇన్‌గ్లిస్: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు ఇన్‌గ్లి్‌స, మార్ష్‌ (10) తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. ముఖ్యంగా ఇన్‌గ్లి్‌స ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో పవర్‌ప్లేను లఖ్‌నవూ 92/1తో ముగించింది. ఫామ్‌లో లేని పూరన్‌ (1)ను నూర్‌ వెనక్కి పంపగా, 10వ ఓవర్‌లో ఇన్‌గ్లి్‌స, పంత్‌లను ఓవర్టన్‌ అవుట్‌ చేశాడు. మార్‌క్రమ్‌ (6), అక్షత్‌ రఘువంశీ (18) కూడా విఫలం కావడంతో.. లఖ్‌నవూ 147/6తో ఇబ్బందుల్లో పడింది. కానీ, డెత్‌ ఓవర్లలో షాబాజ్‌, హిమ్మత్‌ (17) ఏడో వికెట్‌కు 50 రన్స్‌ జోడించడంతో.. లఖ్‌నవూ 200 మార్క్‌ను అందుకోగలిగింది.

నాన్నకు..

ప్రేమతో

గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల ఉర్విల్‌ పటేల్‌కు దేశవాళీ క్రికెట్‌లో దూకుడైన ఆటగాడిగా పేరుంది. 2024 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో త్రిపురతో మ్యాచ్‌లో గుజరాత్‌ తరఫున 28 బంతుల్లోనే శతకం, 2025/26 సీజన్‌లో 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారత్‌-ఎ తరఫున కూడా ఆడాడు. 2023 ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో ఉన్న ఉర్విల్‌.. 2025లో వన్ష్‌ బేదీ రీప్లే్‌సమెంట్‌గా చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇక, ఉర్విల్‌ కెరీర్‌ ఎదుగుదలలో తండ్రి ముకేశ్‌ పటేల్‌ పాత్ర ఎంతో ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో రికార్డు హాఫ్‌ సెంచరీకి చేరుకోగానేఉర్విల్‌.. ‘ఇది నీకోసమే పప్పా’ అని రాసిన పేపర్‌ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ: ఇన్‌గ్లి్‌స (సి) శాంసన్‌ (బి) ఓవర్టన్‌ 85, మార్ష్‌ (సి) బ్రేవిస్‌ (బి) కాంబోజ్‌ 10, పూరన్‌ (సి/సబ్‌) సర్ఫ్‌రాజ్‌ (బి) నూర్‌ 1, పంత్‌ (బి) ఓవర్టన్‌ 15, మార్‌క్రమ్‌ (రనౌట్‌) 6, అక్షత్‌ రఘువంశీ (సి) ఉర్విల్‌ (బి) ఓవర్టన్‌ 18, షాబాజ్‌ (నాటౌట్‌) 43, హిమ్మత్‌ సింగ్‌ (బి) కాంబోజ్‌ 17, షమి (రనౌట్‌) 0, అవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 203/8; వికెట్ల పతనం: 1-77, 2-92, 3-112, 4-115, 5-130, 6-147, 7-197, 8-197; బౌలింగ్‌: అకీల్‌ హుస్సేన్‌ 4-0-49-0, ముకేశ్‌ 4-0-45-0, అన్షుల్‌ కాంబోజ్‌ 4-0-47-2, నూర్‌ అహ్మద్‌ 4-0-24-1, ఓవర్టన్‌ 4-0-36-3.

చెన్నై: శాంసన్‌ (బి) దిగ్వేష్‌ 28, రుతురాజ్‌ (బి) షాబాజ్‌ 42, ఉర్విల్‌ (సి) అవేశ్‌ (బి) షాబాజ్‌ 65, కార్తీక్‌ (సి) అక్షత్‌ (బి) అవేశ్‌ 20, బ్రేవిస్‌ (బి) దిగ్వేష్‌ 10, దూబే (నాటౌట్‌) 15, ప్రశాంత్‌ (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.2 ఓవర్లలో 208/5; వికెట్ల పతనం: 1-45, 2-126, 3-149, 4-169, 5-169; బౌలింగ్‌: షమి 4-0-37-0, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-36-0, దిగ్వేష్‌ 4-0-45-2, అవేశ్‌ ఖాన్‌ 4-0-44-1, షాబాజ్‌ 3-0-30-2, మార్‌క్రమ్‌ 0.2-0-14-0.

ఐపీఎల్‌లో వేగవంతమైన ఫిఫ్టీ చేసిన యశస్వీ జైస్వాల్‌ (13 బంతుల్లో) రికార్డును ఉర్విల్‌ సమం చేశాడు. రాహుల్‌, కమిన్స్‌, షెఫర్డ్‌ (14 బంతుల్లో) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్‌లో 180+ స్కోరు ఛేధించడం 2018 తర్వాత చెన్నైకి ఇదే తొలిసారి.

1-Sports-slider.jpg

ఇవి కూడా చదవండి:

రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

Updated Date - May 11 , 2026 | 05:21 AM