ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్
ABN , Publish Date - May 10 , 2026 | 01:05 PM
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇర్ఫాన్ కారు ముందు సీట్లో కూర్చొని కనిపిస్తాడు. ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి కారు వద్దకు వచ్చి.. ఇర్ఫాన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని గుర్తుచేస్తారు. కొద్దిసేపు కారులో ఉన్నవారితో ట్రాఫిక్ పోలీసు సీరియస్‌గా మాట్లాడారు. కాసేపటి తర్వాత ఇర్ఫాన్‌ను స్టార్ క్రికెటర్ అని గుర్తుపట్టి.. సంభాషణను సరదాగా మార్చారు.
'మీరు సెలబ్రిటీ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. నలుగురి స్ఫూర్తిగా ఉండాలి' అని ఇర్ఫాన్‌కు ట్రాఫిక్ పోలీసు తెలిపారు. మీరు సుమారు రూ.5,000(పాక్ కరెన్సీలో) జరిమానా కట్టాల్సి ఉంటుందని చెప్పి.. హెచ్చరికలతో వదిలేశారు. కాసేపు పాకిస్థాన్ క్రికెట్ లీగ్ 2026 గురించి వారి మధ్య సంభాషణ జరిగింది. ముఖ్యంగా ఇటీవల రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ప్రదర్శన గురించి కూడా ఇర్ఫాన్‌ను సదరు పోలీసు అడిగారు. ఇర్ఫాన్ 2024 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున 9 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. వన్డేలలో 48 పరుగులు చేసి, మూడు వికెట్లు పడగొట్టాడు.
టీ20ల్లో ఇర్ఫాన్ 135 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ 2026లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరఫున అతడు ఆడాడు. ఈ సీజన్‌లో అతడు 10 ఇన్నింగ్స్‌లలో 125.21 స్ట్రైక్ రేట్‌తో 149 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ 2026లో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ నాయకత్వంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు వరుసగా నాలుగు ఓటములతో ప్రారంభమైన తమ ప్రస్థానాన్ని వరుస విజయాలతో చిరస్మరణీయంగా మార్చుకుంది. చివరకు ఫైనల్ పోరుకు చేరుకుని.. అక్కడ బాబర్ ఆజం నాయకత్వంలోని పెషావర్ జల్మీ చేతిలో ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి:
కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన సంజు శాంసన్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం