ఐపీఎల్ 2026: కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన సంజు శాంసన్
ABN , Publish Date - May 10 , 2026 | 12:29 PM
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపడతానని తనపై జరుగుతున్న ప్రచారానికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ తెరదించాడు.
స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ కు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇటీవల సంజును టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అలానే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని చేపడతాడని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా సీఎస్కే కెప్టెన్సీ విషయంలో తనపై జరుగుతున్న ప్రచారానికి సంజు శాంసన్ (Sanju Samson) స్పందించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి సీఎస్కే కెప్టెన్సీ సంజు చేపడతాడనే ప్రచారానికి ఆజ్యం పోసింది వ్యాఖ్యతలే. మాజీ క్రికెటర్ ఆశ్విన్ కూడా సంజు కచ్చితంగా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలున్నాయంటూ సంచలన కామెంట్స్ చేయడంతో ఈ ప్రచారం ఊపందుకొంది. అయితే, తాజాగా సంజు ఓ ప్రోమో వీడియోలో అభినవ్ ముకుంద్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను ఎటువంటి డిమాండ్లతో చెన్నై జట్టులో చేరలేదని తేల్చిచెప్పాడు. తాను కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో.. ఎటువంటి డిమాండ్లతో వెళ్ల కూడదని నేర్చుకొన్నానని వెల్లడించాడు.
అలానే కొత్త జట్టులో చేరిన తర్వాత కెప్టెన్సీ చేయాలనే ఆలోచన తన మనసులోకి ఎప్పుడూ రాలేదని సంజు అన్నాడు. ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా జట్టుకు తన వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తన తత్వానికి మలయాళీ మూలాలే కారణమని పేర్కొన్నాడు. సీఎస్కే తనను నమ్మి ఆహ్వానించిందని, అందుకే అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సంజు అన్నాడు.
ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను సంజు ప్రశంసించాడు. రుతు చాలా మంచివాడని, చాలా భిన్నమైన భారత క్రికెట్ సూపర్ స్టార్ అంటూ కొనియాడాడు. అతడు అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటైన సీఎస్కేకు నాయకత్వం వహిస్తున్నాడని, కానీ ఎక్కడా తాను ఒక సూపర్ స్టార్ లాగా ప్రవర్తించడని సంజు తెలిపాడు. అతడు ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిలా మాట్లాడకపోవచ్చు కానీ భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత భరోసా, ఆత్మవిశ్వాసం ఉన్న ఆటగాడు అతడేనని భావిస్తున్నట్లు సంజు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ఫ్యాన్స్‌కు సీఎస్కే ప్రత్యేక సందేశం
వైభవ్ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా!