కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ
ABN , Publish Date - May 10 , 2026 | 12:55 PM
తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అధికార దాహంతో డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్, డీఎంకేల మధ్య 25-30 ఏళ్లుగా పొత్తు ఉంది. 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలన డీఎంకే వల్లే సాధ్యపడింది. డీఎంకే ఎలప్పుడూ కాంగ్రెస్ మంచి కోసమే పని చేసింది. పలు సందర్భాల్లో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్‌ను డీఎంకే గట్టెక్కించింది. కాంగ్రెస్ తీరు ప్రస్తుతం పరాన్నజీవిలా మారింది. అవకాశం దొరకగానే మిత్రులను వంచిస్తోంది. కాంగ్రెస్ మనుగడకు మరో పార్టీ అవసరం అవుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో అవకాశం రాగానే డీఎంకేకు వెన్నుపోటు పోడిచింది’ అని బెంగళూరులో ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ మండిపడ్డారు.
‘ఎన్నికల్లో తమ వైఫల్యాలకు వారు ప్రపంచాన్ని నిందిస్తున్నారు. రాజ్యాంగ ప్రక్రియలపై నెపం నెడుతున్నారు. ఒక ప్రధాన పార్టీ ఇలా చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు. 40 ఏళ్ల క్రితం పార్లమెంటులో కాంగ్రెస్ సంఖ్యాబలం 400కు పైనే ఉండేది. కానీ గత మూడు ఎన్నికల్లో వారికి 100 సీట్లు కూడా రావడం లేదు. మేము గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నాము. దేశవ్యాప్తంగా 21 చోట్ల బీజేపీ లేదా ఎన్డీయే అధికారంలో ఉంది. మాకు అభివృద్ధే మంత్రము’ అని మోదీ కాంగ్రెస్‌పై ఫైరైపోయారు.
కాంగ్రెస్‌కు మెసాలే తెలుసునని అన్నారు. ఆ పార్టీ గ్యారెంటీలన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాలన పట్టదని దుయ్యబట్టారు. ‘కేరళంలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంది. కానీ ఐదేళ్లకు ఇద్దరు ముఖ్యమంత్రులా లేదా ఏడాదికి ఒక ముఖ్యమంత్రా అన్న ఫార్ములాపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. గతంలో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో జరిగినదే ఇటీవల కర్ణాటకలో కూడా జరిగింది. ఇప్పుడు కేరళంలో అదే పునరావృతం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ ఖజానా దోపిడీకి గురవుతుంటుంది’ అని ప్రధాని ఘాటు విమర్శలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్..
తమిళనాడు సీఎం విజయ్‌కు పీఎం మోదీ, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు