వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:28 AM
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదం నెలకొంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబాగే ఆధ్వర్యంలో కొందరు ప్లేయర్లు సూర్యవంశీని తీవ్రంగా రెచ్చగొట్టినట్లు వీడియోల ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ లంక ఆటగాడిని వెనక్కి నెట్టడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) వెంటనే స్పందించింది. మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ నివేదిక ఆధారంగా సూర్యవంశీని రెచ్చగొట్టిన లంక ఆటగాడు హలంబాగేతో పాటు మరికొందరిపై ఎస్‌ఎల్‌సీ కఠిన ఆంక్షలు విధించినట్లు ఓ స్పోర్ట్స్ మీడియా నివేదించింది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నది అనే విషయం మాత్రం వెల్లడికాలేదు. వైభవ్ విషయంలో అతిగా ప్రవర్తించిన లంక ప్లేయర్లకు జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు భౌతిక దాడులను ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో, వైభవ్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. 'మా ఆటగాళ్లు టోర్నమెంట్‌పైనే దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం, ఇలాంటి బాహ్య అంశాల వల్ల వారు పరధ్యానం చెందకూడదు' అని పేర్కొంటూ సూర్యవంశీపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. మరోవైపు, వైభవ్ చాలా ప్రశాంతమైన కుర్రాడని, అతడిని ఎలా రెచ్చగొట్టారో తెలియదని భారత సీనియర్ జట్టు స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అన్నారు. సీనియర్ కోచ్‌లు అతనికి దిశానిర్దేశం చేస్తారని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం
ఫిఫా ప్రపంచ కప్2026ను ఘనంగా ఆరంభించిన ఫ్రాన్స్