ఫిఫా ప్రపంచ కప్2026ను ఘనంగా ఆరంభించిన ఫ్రాన్స్
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:36 AM
టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటైన ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచకప్2026ను ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన మ్యా్‌చ్‌లో 3-1 తేడాతో సెనెగల్‌పై ఫ్రాన్స్ విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026ను ఫ్రాన్స్ ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా సెనెగల్ తో జరిగిన మ్యాచ్ లో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ఎంబాపె రికార్డు సృష్టించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2002లో ఫ్రాన్స్‌పై సెనెగల్1-0 ఘన విజయం సాధించింది. ఈ సారి కూడా అదే జరుగుతుందేమో అని మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులు భావించారు. ఆ స్థాయిలో ఇరు జట్లు తొలి అర్ధభాగంలో గోల్ కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.
ఫ్రాన్స్ ఆటగాళ్లు గోల్ కొట్టకుండా సెనెగల్ జట్టు అడ్డుకుంది. గోల్ పోస్ట్ లక్ష్యంగా ఫ్రాన్స్ ఆటగాళ్లు దూసుకెళ్లారు. మరోవైపు ఎంబాపెను అడ్డుకోవడానికి సెనెగల్ ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నించారు. తొలి అర్ధ భాగంలో ఎంబాపెను అడ్డుకోవడంలో సెనెగల్ ప్లేయర్లు సక్సెస్ అయ్యారు. ఎలాంటి గోల్ లేకుండానే తొలి అర్ధభాగం ముగిసింది. రెండో అర్ధభాగంలో ఎంబాపె తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. 66వ నిమిషంలో గోల్ కొట్టి తన దేశాన్ని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 82 నిమిషాల వద్ద బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0కి పెరిగింది.
అదనపు సమయంలో సెనెగల్ ప్లేయర్ ఇబ్రహీం ఎంబాయె గోల్ కొట్టడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. అయితే ఆ ఆనందాన్ని సెనెగల్‌కు ఎంతో సేపు ఉండనివ్వలేదు ఎంబాపే. నిమిషం వ్యవధిలోనే ఎంబాపె 30 మీటర్ల దూరం నుంచి అద్భుతమైన గోల్ కొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా 8 షాట్స్ కొట్టగా, సెనెగల్ ఆటగాళ్లు 2 సార్లు కొట్టారు. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో మొరాకో విషయంలో జరిగినట్లే, సెనెగల్ జట్టు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై శ్రీలంక సంచలన విజయం