ఈజిప్ట్ సెల్ఫ్ గోల్
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:40 AM
ఒకవైపు టాప్-10 టీమ్ బెల్జియం.. మరోవైపు వరల్డ్‌క్‌పలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని ఈజిప్ట్. డిబ్రుయెన్, లుకాకు లాంటి మేటి ఆటగాళ్లున్న రెడ్ లయన్స్ అలవోకగా గెలుస్తుందని...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
అర్జెంటీనా X అల్జీరియా
(ఉదయం 6.30)
ఆస్ట్రియా X జోర్డాన్
(ఉదయం 9.30)
పోర్చుగల్ X కాంగో
(రాత్రి 10.30)
ఇంగ్లండ్ X క్రొయేషియా
(రాత్రి 1.30)
ఘనా X పనామా
(గురువారం తెల్లవారుజామున 4.30)
డ్రాతో గట్టెక్కిన బెల్జియం
ఫిఫా వరల్డ్‌కప్
ఒకవైపు టాప్-10 టీమ్ బెల్జియం.. మరోవైపు వరల్డ్‌క్‌పలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని ఈజిప్ట్. డిబ్రుయెన్, లుకాకు లాంటి మేటి ఆటగాళ్లున్న రెడ్ లయన్స్ అలవోకగా గెలుస్తుందని భావించారు. కానీ, ఫీల్డ్‌లో జరిగింది వేరు. జెయింట్ లాంటి బెల్జియంను 29వ ర్యాంకర్ ఈజిప్ట్ వణికించింది. ఒక దశలో సంచలనం సృష్టించేలా కనిపించినా.. ప్రత్యర్థి సెల్ఫ్ గోల్‌తో బెల్జియంకు పరాభవం తప్పింది.
సియాటెల్: ఫిఫా ప్రపంచక్‌పలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్.. టోర్నీ ఫేవరెట్ జట్లలో ఒకటైన బెల్జియంను ముప్పుతిప్పలు పెట్టింది. గ్రూప్-జిలో మంగళవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఒకదశలో రెడ్ లయన్స్‌కు ఓటమి తప్పదనిపించినా.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వెటరన్ స్ట్రయికర్ రుమేలు లుకాకు తనదైన శైలిలో దూసుకెళ్లి ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో కలకలం సృష్టించాడు. ఈ ఒత్తిడిలో ఈజిప్ట్ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో.. బెల్జియం డ్రాతో గట్టెక్కింది. స్టార్ ఆటగాళ్లతో బలంగా ఉన్న బెల్జియంను ఈజిప్ట్ వేగవంతమైన ఆటతో ఇబ్బందులు పెట్టింది. మరోవైపు బెల్జియానికి ఎన్నో అవకాశాలు దక్కినా.. ఫినిషింగ్ లోపంతో గోల్ చేయలేక పోయింది. బర్త్ డే బాయ్, స్టార్ ప్లేయర్ మొ సలా కేంద్రంగా ఈజిప్ట్ రూపొందించిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది. మైదానంలో పాదరసంలా కదులుతూ.. బెల్జియం పోస్టుపై పదేపదే ఈజిప్ట్ దాడులు చేస్తుంటే.. రెడ్ లయన్స్ వద్ద సమాధానమే లేకపోయింది. ఈ క్రమంలో 19వ నిమిషంలో ఇమామ్ అషోర్ పవర్‌ఫుల్ కిక్‌తో గోల్ చేసి ఈజి్‌ప్టను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. నిర్ఘాంతపోయిన బెల్జియం పదేపదే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. 66వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లుకాకు.. 23 సెకన్లలోనే గోల్ అవకాశం సృష్టించాడు. బంతిని అందుకొన్న లుకాకు వేగంగా ప్రత్యర్థి-డి లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఈజిప్ట్ ఆటగాడు మహ్మద్ హానీకి తగిలిన బంతి గోల్‌లో పడడంతో బెల్జియం 1-1తో సమం చేసింది.
సౌదీ, ఇరాన్ మ్యాచ్‌లు కూడా..
గ్రూప్-జిలో ఇరాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ 2-2తో డ్రా అయింది. కివీస్ తరఫున ఎలీజా జస్ట్ (7వ, 54వ నిమిషాలు) డబుల్ గోల్స్ చేయగా.. ఇరాన్ ప్లేయర్లు రమిన్ డిజెయిన్ (32వ), మహ్మద్ మొహెబ్బి (64వ) చెరో గోల్ సాధించారు. గ్రూప్-హెచ్‌లో సౌదీ అరేబియా-ఉరుగ్వే జట్ల మధ్య మ్యాచ్ 1-1తో సమంగా ముగిసింది. 41వ నిమిషంలో సౌదీ ప్లేయర్ అబ్దుల్లా అల్ అమ్రి గోల్ చేసి 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, 80వ నిమిషంలో ఉరుగ్వే ప్లేయర్ మ్యాక్సీ అరౌజో గోల్ చేసి సమం చేశాడు.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..