Share News

అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజ‌యం

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:43 AM

డిఫెండింగ్ ఛాంపియ‌న్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచ‌క‌ప్ 2026ను ఘ‌నంగా ప్రారంభించింది. ఇవాళ అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది.

అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజ‌యం
Argentina vs Algeria

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా బోణీ కొట్టింది. ఇవాళ (బుధవారం) గ్రూప్‌-జెలో భాగంగా అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో మెరిశాడు. త‌ద్వారా ఫిఫా చ‌రిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో జ‌ర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోజ్‌(16)తో కలిపి మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి పట్టికలో టాప్ ప్లేసులో నిలిచింది.


మెస్సీకి ఇది ఆరో ఫిఫా ప్రపంచ కప్‌ కాగా... ఇవాళ అల్జీరియాతో జరిగిన మ్యాచ్ 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ త‌ర్వాత ఆట 60వ నిమిషంలోనూ మెస్సీ మ‌రోసారి మెరిశాడు.


ఈసారి రైట్ కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి త‌ర‌లించి అర్జెంటీనా 2-0 తేడాతో ముందంజలో ఉంది. ఆట 69వ నిమిషంలో గోల్ కొట్టే అవ‌కాశాన్ని అల్జీరియా మిస్ చేసుకుంది. 76వ నిమిషంలో మ‌రో గోల్ కొట్టిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించాడు ప్రపంచ కప్‌లో మెస్సీకి ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. మరోవైపు దూకుడుగా ఉన్న అర్జెంటీనా ముందు అల్జీరియా ఏమాత్రం నిల‌వ‌లేకపోయింది. ఎక్కువ సమయం బంతి అర్జెంటీనా ఆధీనంలోనే ఉంది.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

ఫిఫా ప్రపంచ కప్2026ను ఘనంగా ఆరంభించిన ఫ్రాన్స్

Updated Date - Jun 17 , 2026 | 09:48 AM