Share News

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్‌ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!

ABN , Publish Date - Jun 17 , 2026 | 08:29 AM

మహారాష్ట్రలో రాజకీయాలు ఇవాళ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. శివసేన (UBT)కు చెందిన పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసే ముందు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఢిల్లీ నివాసంలో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్‌ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!
Uddhav Sena MPs Set for Crucial Delhi Meeting Amid 'Operation Tiger' Defection Speculation

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 17: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పక్షానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 'ఆపరేషన్ టైగర్'పేరుతో సాగుతున్న ఈ పరిణామాల్లో భాగంగా.. శివసేన (UBT) ఎంపీలు బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఈ కీలక భేటీ అనంతరం వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా స్వయంగా పాల్గొననున్నట్లు సమాచారం.

షిండే వైపు చూపు చూస్తున్న ఆరుగురు ఎంపీలు వీరేనా?

మొత్తం 9 మంది శివసేన (UBT) లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనతో టచ్‌లో ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు:

1. సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్)

2. సంజయ్ దేశ్‌ముఖ్(యావత్మాల్)

3. నాగేష్ పాటిల్ అస్తికార్(హింగోలి)

4. ఓంరాజే నింబాల్కర్(ధారాశివ్)

5. భావూసాహెబ్ వాక్‌చౌరే(శిరిడీ)

6. సంజయ్ జాదవ్(పర్భణీ)

వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. యాంటీ డిఫెక్షన్ (పార్టీ ఫిరాయింపుల) చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. మొత్తం 9 మందిలో 2/3 వంతు అంటే కనీసం ఆరుగురు ఎంపీలు విడిపోవాల్సి ఉంటుంది. ఈ తిరుగుబాటు ఎంపీలు ముందుగా లోక్‌సభలో ప్రత్యేక పక్షంగా ఏర్పడి, ఆపై జూన్ 19న 'శివసేన వ్యవస్థాపక దినోత్సవం' (Shiv Sena Foundation Day) సందర్భంగా అధికారికంగా షిండే వర్గంలో విలీనం కావచ్చని తెలుస్తోంది.


'మాతోశ్రీ' భేటీతో బలపడిన అనుమానాలు

ఇటీవల ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'లో జరిగిన అత్యవసర సమావేశానికి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఐదుగురు ఎంపీలు ఈ భేటీకి దూరంగా ఉండటంతో ఉద్ధవ్ క్యాంప్‌లో గుబులు మొదలైంది.

'ఆపరేషన్ వోల్ఫ్'తో కౌంటర్ ఇస్తాం: సంజయ్ రౌత్

ఈ ప్రచారాన్ని శివసేన (UBT) ఫైర్‌బ్రాండ్ నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని, ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 'కొందరు వ్యక్తిగత, వైద్య కారణాల వల్లే మాతోశ్రీ సమావేశానికి రాలేకపోయారు, కానీ వారంతా వర్చువల్‌గా (ఆన్‌లైన్ ద్వారా) హాజరయ్యారు. విపక్షాలు మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. వారి 'ఆపరేషన్ టైగర్'కు కౌంటర్‌గా మేము 'ఆపరేషన్ వోల్ఫ్' (Operation Wolf)ప్రారంభిస్తాం' అని రౌత్ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ అత్యవసర భేటీ

ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. జూన్ 22న సాయంత్రం 4 గంటలకు ముంబైలోని నారిమన్ పాయింట్‌లో గల పార్టీ కార్యాలయం 'శివాలయ'లో శివసేన (UBT) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అత్యవసర సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు.2022లో శివసేనను చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏకనాథ్ షిండే.. ఇప్పుడు లోక్‌సభ వేదికగా రెండోసారి అలాంటి వ్యూహాత్మక దెబ్బ కొట్టబోతున్నారా అనేది రానున్న 48 గంటల్లో తేలనుంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

Updated Date - Jun 17 , 2026 | 08:46 AM