భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:50 PM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ2026లో భారత్ - ఎ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇవాళ యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే భారత్ ఛేదించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీ (Asia Cup Rising Stars 2026)లో భారత్ - ఎ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇవాళ(మంగళవారం) యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే యువ భారత్ అలవోకగా ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (204) వీర విధ్వంసం సృష్టించి యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, 150, డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 16 బంతుల్లో 50, 28 బంతుల్లో 100, 40 బంతుల్లో 150, 52 బంతుల్లో 200 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే...టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో రాణించాడు. అయితే మిగతా ప్లేయర్లు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. చివర్లో కెప్టెన్ బాసిల్ హమీద్ (36 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ 250 మార్క్ దగ్గరగా వచ్చింది. మిగతా ప్లేయర్లలో ముహమ్మద్ షాదాద్ (28), ఈథన్ డిసౌజా (25) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, సూర్యాంశ్ షేడ్గే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. ఆరంభ నుంచి దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ 12 పరుగులకే ఔటయ్యాడు. ఇదే సమయంలో వైభవ్ రూపంలో యూఏఈ బౌలర్లకు పట్టపగలు చుక్కలు కనిపించాయి. అతడి విధ్వంసం ధాటికి బంతులు ఎటు వెయ్యాలో అర్థం కానీ అయోమయస్థితిలోకి యూఏఈ బౌలర్లు చేరారు. 250 టార్గెట్‌లో వైభవ్ ఒక్కటే 52 బంతుల్లో 204 పరుగులు చేశాడంటే.. అతడు ఏ స్థాయిలో చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. 50 ఓవర్ల మ్యాచ్.. ఈ చిచ్చర పిడుగు దెబ్బకు టీ20గా మారింది. మిగిలిన బ్యాటర్లలో రింకూ సింగ్ 27, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 3 పరుగులు చేశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యంగ్ ఇండియా.. ఘన విజయంతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి:
భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌లు నిషేధం
తెలంగాణలో పనిచేయడం సంతృప్తినిచ్చింది: మీనాక్షి నటరాజన్