Share News

టీ20లో ప్రియాన్ష్ రికార్డు.. 68 బంతుల్లో 181 పరుగులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:48 PM

టీ20 క్రికెట్‌లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య త్రుటిలో ప్రపంచ రికార్డు మిస్ చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న ప్రియాంశ్ ఆర్య.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో 68 బంతుల్లో 181 పరుగులు చేశాడు.

టీ20లో ప్రియాన్ష్ రికార్డు.. 68 బంతుల్లో 181 పరుగులు

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్‌లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య త్రుటిలో ప్రపంచ రికార్డు మిస్ చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న ప్రియాంశ్ ఆర్య.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో 68 బంతుల్లో 181 పరుగులు చేశాడు. అందులో 19 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాది ప్రపంచ రికార్డును కూడా అతను సమం చేశాడు. కాగా.. అంతకుముందు టీ20లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌ స‌ృష్టించిన రికార్డును ప్రియాన్ష్ అధిగమించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రియాన్ష్ త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్ అయ్యాడు. టీ20లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సౌతాఫ్రికా ఆటగాడు లువాన్ డే ప్రిటోరియస్ పేరిట ఉంది. ఈ ఏడాది అక్టోబరులో సీఎస్ఏ ప్రో 20 కప్‌లో టైటాన్ తరఫున ఆడిన అతను.. నైట్స్‌పై 79 బంతుల్లో 188 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.


ఢిల్లీ 275/5

ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్‌లో తమిళనాడుతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యష్ ధుల్ మూడో ఓవర్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత నితీశ్ రాణాతో కలిసి ప్రియాన్ష్ ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 118 పరుగులు చేసింది. రాణా 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు. మరోవైపు ప్రియాన్ష్ 36 బంతుల్లో 12 సిక్సులు, 4 ఫోర్లు బాది సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత కూడా తన ఊచకోతను అతను కొనసాగించాడు. ఈ క్రమంలో రాహుల్ రికార్డును అతను అధిగమించాడు. మొత్తం 68 బంతులు ఎదుర్కొని 181 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.


టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్స్

1. లువాన్ డే ప్రిటోరియస్ 188* (79)

2. ప్రియాన్ష్ ఆర్య 181 (68)

3. క్రిస్ గేల్ 175* (66)

4. ఆరోన్ ఫించ్ 172 (76)

5. హమ్జా ఖాన్ 164* (65)


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 02:17 PM