Share News

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మాటేంటి?

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:11 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ డ్రా దరిమిలా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ అవకాశాలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రస్తుతం మన ఖాతాలో 50 శాతం..

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మాటేంటి?

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ డ్రా దరిమిలా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ అవకాశాలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రస్తుతం మన ఖాతాలో 50 శాతం డబ్ల్యూటీసీ పర్సంటేజీ పాయింట్లున్నాయి. కివీస్‌తో మొదటి టెస్టుకు ముందు అది 51.52 శాతం కావడం గమనార్హం. ఇక..ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌ (2024-27)లో టీమిండియా మరో 6 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు కూడా ఉంది. మిగిలిన ఐదు టెస్టులను వచ్చే ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో భారత్‌లోనే ఆడాలి. కాగా..ప్రస్తుతం 75 శాతంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (69.23), న్యూజిలాండ్‌ (66.67) రెండు, మూడు స్థానాలలో నిలిచాయి. ఈనేపథ్యంలో మన జట్టు పాయింట్ల శాతం 66.67కి చేరాలంటే మిగిలిన ఆరు టెస్టులనూ నెగ్గాల్సిందే. అప్పటికీ టాప్‌-2 జట్ల కంటే మనోళ్లు వెనుకంజలోనే ఉంటారు. ఒకవేళ మిగిలిన 6 టెస్టుల్లో ఐదు నెగ్గి, ఒకటి డ్రా చేసుకొంటే టీమిండియా 62.96 శాతం పాయింట్లతో ఉంటుంది. ఐదింటిలో గెలిచి, ఒక టెస్టు ఓడితే గిల్‌ సేన పాయింట్ల శాతం 61.11కి పడిపోతుంది. అందువల్ల డబ్ల్యూటీసీ తుది రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు టెస్టులను భారత్‌ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాదు..ఇతర జట్ల ఫలితాలూ మనకు అనుకూలించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చూస్తే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణాఫ్రికా టైటిల్‌ ఫైట్‌కు చేరడం దాదాపు ఖాయం. ఆ జట్టుకు మిగిలిన ఐదు టెస్టుల్లో మూడు నెగ్గితే సరిపోతుంది. బంగ్లాదేశ్‌తో ఆ జట్టు టెస్టు సోమవారం సెంచూరియన్‌లో ప్రారంభమైంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Nov 24 , 2026 | 03:13 AM