Share News

బౌలర్లు తేలిపోయారు.. డ్రాతో సరిపెట్టారు

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:16 AM

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభిద్దామనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. ఫ్లాట్‌ పిచ్‌పై భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా ఆఖరి రోజైన సోమవారం ప్రత్యర్థి జట్టు మొత్తం వికెట్లు తీయలేకపోయారు.

బౌలర్లు తేలిపోయారు.. డ్రాతో సరిపెట్టారు

  • డ్రాతో సరిపెట్టారు

  • 43 ఓవర్లపాటు క్రీజులోనే..

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభిద్దామనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. ఫ్లాట్‌ పిచ్‌పై భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా ఆఖరి రోజైన సోమవారం ప్రత్యర్థి జట్టు మొత్తం వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా గిల్‌ సేన గెలుపు ఆశలపై డారిల్‌ మిచెల్‌ (186 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (126 బంతుల్లో 2 ఫోర్లతో 26 నాటౌట్‌) జోడీ నీళ్లు జల్లింది. త్వరగా ఆరో వికెట్‌ను పడగొడితే టెయిలెండర్లను చుట్టేయవచ్చని భారత్‌ ఆశించింది. కానీ మిచెల్‌కు ఫిలిప్స్‌ జత కట్టాక బౌలర్లకు బంతులు వేయడం తప్ప మరేమీ మిగల్లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో చెలరేగే ఈ ఇద్దరూ తమ అద్భుత డిఫెన్స్‌ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ.. ఆరో వికెట్‌కు ఏకంగా 258 బంతులను ఎదుర్కొని సవాల్‌ విసిరారు. ఇక ఈ పిచ్‌పై మిగిలిన ఐదు వికెట్లు తీయడం అసాధ్యమనే ఆలోచనతో మరో గంట ఆట ఉండగానే గిల్‌ డ్రాకు అంగీకరించాడు. అప్పటికి కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 239/5 స్కోరుతో ఉంది. కాన్వే (65), రచిన్‌ (37) ఫర్వాలేదనిపించారు. ప్రసిద్ధ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 రన్స్‌ చేయగా, భారత్‌ 720/9 స్కోరు దగ్గర డిక్లేర్‌ చేసింది. ఈ ఫలితంతో ఇరుజట్లకు నాలుగేసి పాయింట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నికోల్స్‌ నిలిచాడు.


తొలి సెషన్‌లో రెండు వికెట్లతో..: ఓవర్‌నైట్‌ స్కోరు 119/2తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ డ్రా లక్ష్యంగా బ్యాటింగ్‌ సాగించింది. తొలి గంట ఓపిగ్గా ఆడాక స్వల్ప వ్యవధిలోనే కాన్వే, రచిన్‌ల వికెట్లను కోల్పోయింది. దీంతో భారత బౌలర్లలో జోష్‌ కనిపించింది. అటు మిచెల్‌-బ్లండెల్‌ (15) నిదానంగా ఆడడంతో కివీస్‌ ఈ సెషన్‌ 26 ఓవర్లలో 38 పరుగులే చేసింది. ఇక రెండో సెషన్‌ ఆరంభంలోనే బ్లండెల్‌ను అన్షుల్‌ అవుట్‌ చేయడంతో జట్టు 176/5తో నిలిచింది. అప్పటికి దాదాపు రెండు సెషన్ల ఆట ఉండగా.. మరో 5 వికెట్లు తీస్తే భారత్‌ గెలిచేదే. కానీ 78వ ఓవర్‌ నుంచి మిచెల్‌కు ఫిలిప్స్‌ జత కలవడంతో నెమ్మదిగా టీమిండియా విజయావకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమకు డిఫెన్స్‌ మాత్రమే వచ్చన్నట్టుగా ఆ ఇద్దరి ఆట సాగింది. ఓ దశలో రెండో సెషన్‌తో పాటు ఆఖరి సెషన్‌లోనూ 43 బంతుల పాటు ఒక్క సింగిల్‌ కూడా రాకపోవడం గమనార్హం. కెప్టెన్‌ గిల్‌ 8 మంది బౌలర్లను ప్రయోగించినా ఆ జోడీని విడదీయలేకపోయాడు. చివరకు ఈ ద్వయం 43 ఓవర్లపాటు క్రీజులో పాతుకుపోయిన వేళ.. చేసేదేమీ లేక గిల్‌ డ్రాకు అంగీకరించాడు. అప్పటికి మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడం గమనార్హం.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 368; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 720/9 డిక్లేర్‌; న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, కాన్వే (సి) పంత్‌ (బి) సుందర్‌ 65, నికోల్స్‌ (సి) జురెల్‌ (బి) ప్రసిద్ధ్‌ 31, రచిన్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 37, మిచెల్‌ (నాటౌట్‌) 49, బ్లండెల్‌ (సి) పంత్‌ (బి) అన్షుల్‌ 15, ఫిలిప్స్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 120 ఓవర్లలో 239/5. వికెట్ల పతనం: 1-0, 2-60, 3-132, 4-139, 5-176. బౌలింగ్‌: బుమ్రా 20-7-42-1, ఆకాశ్‌ 20-6-47-0, అన్షుల్‌ 22-5-45-1, ప్రసిద్ధ్‌ 19-10-23-2, సుందర్‌ 35-14-65-1, దేవ్‌దత్‌ 1-0-2-0, జైస్వాల్‌ 2-0-4-0, జురెల్‌ 1-0-1-0.

Updated Date - Nov 24 , 2026 | 03:20 AM