కోహ్లీ, రోహిత్‌లకు కష్టమైనది.. ఈజీగా సాధించిన వైభవ్!
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:44 PM
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులు కొల్లగొట్టిన వైభవ్.. తాజాగా
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులు కొల్లగొట్టిన వైభవ్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును నమోదు చేశాడు. ఈ యువ సంచలనం సృష్టించిన రికార్డు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న కేవలం 28 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్.. టీమిండియా వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాని రీతిలో సునీల్ నరైన్‌పై విరుచుకుపడ్డాడు.
వెస్టిండీస్ స్టార్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే ప్రపంచ స్థాయి బ్యాటర్లు కూడా వణికిపోతుంటారు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్‌ల్లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో కేవలం రెండేసి సిక్సర్లు బాదారు. కానీ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో సునీల్ నరైన్‌ను ఎదుర్కొన్న తొలి ఇన్నింగ్స్‌లోనే.. అది కూడా రెండో బంతికే భారీ సిక్సర్ కొట్టాడు. రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలకు ఏళ్ల సమయం పట్టిన పనిని.. ఈ వైభవ్ సెకన్ల వ్యవధిలో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ బౌలర్లు వేసిన తొలి బంతినే బౌండరీగా పంపి తన నిర్భయత్వాన్ని చాటుకున్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనూ శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 41 సగటుతో 246 పరుగులు సాధించాడు. వైభవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 236.53 ఉండటం విశేషం. ప్రస్తుతం టాప్ స్కోరర్ల జాబితాలో వైభవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్
సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్