Share News

భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:25 PM

అఫ్గానిస్థాన్ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్‌, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు.

భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!
Rashid Khan

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. మూడు రోజుల క్రితం తనకు మగ బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాజాగా భారత్‌, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్ల విషయంలో సంచలన విషయాలను వెల్లడించాడు. ఆ దేశాల నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు. అఫ్గానిస్తాన్ కే ప్రాతినిధ్యం వహించడానికే తాను కట్టుబడి ఉన్నానని తెలిపాడు. ఈ స్టార్ లెగ్-స్పిన్నర్ తనకు సంబంధించిన'రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.


ఈ పుస్తకంలో తన జీవితం గురించి విపులంగా వివరిస్తూ.. 2023 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 'భారత క్రికెట్‌కు చెందిన ఒక సీనియర్ వ్యక్తి నన్ను కలవాలనుకుంటున్నారని ఒక జట్టు అధికారి చెప్పారు. నేను వెళ్లి ఆ అధికారికి నమస్కరించాను. మా మధ్య సంభాషణ సాగుతున్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు. 'మీ దేశంలో (ఆఫ్గానిస్థాన్) పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారత్ వచ్చి ఉండండి. మేము మీకు భారతీయ పౌరసత్వం ఇస్తాము. ఇక్కడే క్రికెట్ ఆడండి. అయితే ఆయన మాటలకు నేను ఆశ్చర్యపోయాను, ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. కానీ నేను నవ్వి, 'చాలా ధన్యవాదాలు. నేను నా దేశం కోసం మాత్రమే ఆడుతాను' అని చెప్పినట్లు పుస్తకంలో రాశాడు.


అలానే ఆస్ట్రేలియా నుంచీ పౌరసత్వం, ఆడే అవకాశం వంటి ఆఫర్లు వచ్చాయని రషీద్ ఖాన్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. కాగా, రషీద్ ఖాన్ దేశభక్తి గతంలో కూడా వార్తల్లో నిలిచింది. 2018 ఐపీఎల్‌ సమయంలో భారత అభిమానులు ఆయనకు పౌరసత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ అంశంపై అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ, పౌరసత్వ నిర్ణయాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని నంగర్‌హార్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రస్థానానికి ఎదిగిన రషీద్ ఖాన్ ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. మొత్తంగా రషీద్ తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి, విలువలపై నిలబడే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్

Updated Date - Apr 20 , 2026 | 12:39 PM