Share News

జమ్మూ కాశ్మీర్‌లో బస్సు బోల్తా.. 15 మంది మృతి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:44 AM

జమ్మూ కాశ్మీర్‌ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూ కాశ్మీర్‌లో బస్సు బోల్తా.. 15 మంది మృతి

శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్‌ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఉదంపూర్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకోగానే జిల్లా ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


అతివేగం కారణంగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. సోమవారం రామ్‌నగర్‌ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ఉదంపూర్ జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం కోసం ఎయిర్ అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.


మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైన మేరకు అన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు.


ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్ల ఏర్పాటు: సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

Read Latest National News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 12:24 PM