ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:51 AM
సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.
అమరావతి, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కూడా సీఎంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు, సంబరాలతో చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం పుట్టినరోజు వేడుకల్లో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు 76 కేజీల కేక్ కట్ చేశారు. సీఎం చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ రెండు ప్రత్యేక పాటలను ఆవిష్కరించారు.
అనంతపురం: చంద్రబాబు జన్మదినం సందర్భంగా అనంతపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షరీఫ్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. రక్త దానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. మెగా రక్తదాన శిబిరానికి వేలాదిగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇప్పటికే ఐదు వేల మందికి పైగా రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ ట్రస్ట్, రెడ్ క్రాస్‌తో పాటు పలు జిల్లాలకు చెందిన స్వచ్ఛంద రక్తదాన సంస్థలు పాల్గొన్నాయి.
నెల్లూరు: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఏఎంసీ ప్రాంతంలో ఆనం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి కూటమి పార్టీల నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆనం కుటుంబసభ్యులు మహాయజ్ఞం నిర్వహించారు. పది వేల మంది మహిళలకు చీరలు, కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా: కదిరిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కదిరిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నేతలు ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం, అరాచకం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. భారతదేశ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. తెలుగుజాతి రాజకీయాలలో చంద్రబాబు ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆకాంక్షించారు.
చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సీబీఎన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం ప్రజల దాహార్తి తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు చిత్ర పటానికి మూడువందల బిందెల కృష్ణా జలాలతో మహిళలు అభిషేకం చేశారు. వంద ట్రాక్టర్లతో సీఎం చిత్రాలతో పల్లకీలతో ఊరేగింపు, భారీ బైక్, ఈ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు పేరుమీద నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్విమ్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి.. సుమారు వెయ్యిమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నాలుగు మండలాల్లో పేదలకు అన్న క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం పంపిణీ చేశారు.
పగో: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, వృద్ధులు, వికలాంగులకు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. తణుకులో సీఎం జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘనంగా నిర్వహించారు. మహిళలు చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. వ్యాపార ఉపాధి కల్పన కోసం 15 మందికి తోపుడు బండ్లు, 8 మందికి ఎగ్ కార్ట్స్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
చిత్తూరు: చంద్రబాబు జన్మదినం సందర్భంగా కాణిపాకం పుణ్యక్షేత్రంలో చైర్మన్ మణి నాయుడు, ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు నిండు నూరేళ్ల జీవితాన్ని... ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని టీడీపీ నేతలు ప్రార్థించారు.
విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు, 44వ వార్డు ఇన్‌ఛార్జ్ కోయిలాడ వెంకటేశ్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలో 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
కాకినాడ: జిల్లా టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్.. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఏలూరు: టీడీపీ జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కడప: జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు.
కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో ఆశాజ్యోతి దివ్యాంగుల ఆశ్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. హ్యాండిక్యాప్డ్‌లతో కలిసి చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేశారు. ఆపై చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా రూపుదిద్దిన శ్రమజీవి అని కొనియాడారు. నిపుణుల కన్నా అడ్వాన్స్‌గా ఆలోచించగలిగే వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పీక్స్‌కు హోర్ముజ్ ఉద్రిక్తతలు! ఇరాన్ నౌకను సీజ్ చేసిన యూఎస్
అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు
Read Latest AP News And Telugu News