ఐపీఎల్‌లో 'బ్లాక్ మ్యాజిక్' జరిగింది... లలిత్ మోదీ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:59 PM
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో బ్లాక్ మ్యాజిక్ కలకలం రేగింది. దీనిపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన కామెంట్స్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం(ఏప్రిల్ 18) చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో విచిత్ర ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఎస్ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదవడం చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ అంశంపై సీఎస్కే ఫిర్యాదు చేసినట్లు ఒక నకిలీ లేఖ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. స్టేడియంలో ఒక అభిమాని 'క్షుద్రపూజలు' చేశాడని సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఆ ఫ్రాంచైజీ ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో ఉంది. అయితే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ అపోహను ఖండిస్తూ ఆ లేఖ 'నకిలీది' అని పేర్కొన్నారు. అయితే, గతంలో ఒక ఫ్రాంచైజీ యజమాని 'మూఢనమ్మకాల ఆచారాలు' పాటించారంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ కు సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలు గురించి బాగా తెలిసిన లలిత్ మోదీ, ఒక జట్టు యజమాని ఒకసారి ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మూఢనమ్మకంతో కూడిన ఆచారాన్ని పాటించారని వెల్లడించాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో సదరు వ్యక్తి చేసిన బ్లాక్ మ్యాజిక్ నకిలీలా అనిపిస్తోందని, కానీ గతంలో ఓ ఫ్రాంఛైజీ యజమాని ఇలాంటి పద్ధతికి పాల్పడ్డాడని లలిత్ మోదీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
'ఒక జట్టు యజమాని ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో స్వయంగా బ్లాక్ మ్యాజిక్ చేయడం గురించి నేను పోస్ట్ చేసినట్లు నాకు గుర్తుంది. 2011లో ఇది జరిగినప్పుడు నేను సదరు వ్యక్తులను హెచ్చరించాను. నాకు పక్కా ఆధారాలతో కూడిన సమాచారం అందింది. ఈ కార్యకలాపాలన్నింటినీ ఎవరు చేశారో కూడా నేను బయటపెడతాను' అని పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక విషయానికి వస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి ఆరు మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచి 4వ స్థానంలో నిలిచింది. మరోవైపు, సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్