Share News

హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్.. అసలు నిజం ఇదే!

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:14 PM

టీమిండియా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ సోమ‌ర్‌సాల్ట్ వేసి మరీ త‌ల‌కిందులుగా స్ట‌న్నింగ్ క్యాచ్ తీసుకోవ‌డం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇదంతా ఏఐ స‌హాయంతో రూపొందించిన ఫేక్ వీడియో అని కాసేప‌టికే తేలిపోయింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్.. అసలు నిజం ఇదే!
AI generated video

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)వినియోగం బాగా పెరిగిపోయింది. ఇది వచ్చాక క్రియేటివిటీ బాగా పెరిగింది. దీని వినియోగించి కొందరు చిత్ర విచిత్రమైన, వీడియోలు ఫొటోలను తయారు చేస్తున్నారు. ఏఐ కారణంగా ఏది నిజమో, ఏది మాయాజాలమూ తెలియడం లేదు. ఇలాంటిదే క్రికెట్‌కు సంబంధించి వీడియో ఒకటి. నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇప్పుడు చూద్దాం...


న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుతమైన క్యాచ్ పట్టిందంటూ ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ క్లిప్ ఏఐ జనరేటేట్ వీడియోగా తేలింది. వీడియోలో ఓ మహిళా క్రికెటర్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో తలక్రిందులుగా ఉండి.. క్యాచ్ పట్టినట్టు కనిపిస్తుంది. కొందరు నెటిజన్లు ఆమెను హర్మన్‌ప్రీత్‌గా , మరికొందరు రాధా యాదవ్ అని పేర్కొన్నారు.


అసాధారణంగా కనిపించిన ఈ క్యాచ్ వీడియో సహజంగానే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అత్యంత కష్టమైన రీతిలో ఫీల్డర్ క్యాచ్ అందుకున్నట్టుగా ఫుటేజ్ ఉండటంతో పలువురు దాన్ని నిజమైనదిగా భావించారు. అయితే వీడియోలో కనిపించే దృశ్యాలు వాస్తవ మ్యాచ్‌లో చోటుచేసుకున్నవి కావు. ఒక‌వేళ రివర్స్ ఫ్లిప్ తీసుకున్నా త‌ల‌కు పెద్ద గాయ‌మ‌వ్వ‌డం గ్యారంటీ. కానీ ఫీల్డ‌ర్ మాత్రం క్యాచ్ తీసుకున్న త‌ర్వాత య‌థాస్థానానికి రావ‌డం వీడియోలో చూపించారు. అదే విధంగా క్యాచ్ అందుకునే క్ర‌మంలో ఫేస్ చూపించ‌లేదు. కానీ రివ‌ర్స్‌ఫ్లిప్ వేసిన‌ప్పుడు మాత్రం కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ క‌నిపించ‌గా, క్యాచ్ అనంత‌రం మ‌రొక ప్లేయ‌ర్ క‌నిపించింది. ఇది ఫేక్ వీడియో అని ఇక్క‌డే క్లియ‌ర్‌గా అర్థ‌మైపోతుందని టెక్ నిపుణులు స్పష్టం చేశారు.


ఇలాంటి వీడియోల వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి వీడియోలను చూసినా గుడ్డిగా నమ్మకుండాప పూర్తి నిజానిజాలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ద్వారా మాత్రమే సమాజాన్ని ఇలాంటి డిజిటల్ మోసాల నుండి కాపాడుకోగలమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!

భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం

Updated Date - Sep 13 , 2026 | 01:47 PM