మహిళల అసభ్యకర ఫొటోలు, వీడియోల కోసం స్నేహితుడి హత్య.. కేసును ఛేదించిన పోలీసులు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:15 PM
కాకినాడ సాంబమూర్తినగర్ ఇందిరాకాలనీలో ఈ నెల 2న జరిగిన గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితులే అతన్ని హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
కాకినాడ: సాంబమూర్తినగర్ ఇందిరాకాలనీలో ఈ నెల 2న జరిగిన గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గిరిధర్‌ను పాలేపు వివేక్ (18), ఏలూరి రామకృష్ణ (21) హత్య చేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మృతుడు గిరిధర్‌కు నిందితులు వివేక్, రామకృష్ణ స్నేహితులు. అయితే, ఇటీవల గిరిధర్ తన సెల్‌ఫోన్‌లో ఉన్న కొంతమంది మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను నిందితులకు చూపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిద్దరూ వాటిని తమకు ఇవ్వాలని గిరిధర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. ఆ ఫొటోలు, వీడియోలను తీసుకుని సంబంధిత మహిళల కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని వివేక్, రామకృష్ణ పథకం వేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గిరిధర్‌తో వారు గొడవకు దిగారు. ఫొటోలు, వీడియోలు ఇచ్చేందుకు గిరిధర్ నిరాకరించడంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం ఈ నెల 2న ముందుగానే తీసుకెళ్లిన కత్తితో గిరిధర్‌పై వివేక్, రామకృష్ణ దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అతడి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ హత్య స్థానికంగా పెను సంచలనంగా మారడంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు గిరిధర్ నుంచి లాక్కున్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్