Share News

నాకు చావే శరణ్యం

ABN , Publish Date - Sep 13 , 2026 | 06:41 AM

చివరి నిమిషంలో ఆసియా క్రీడల నుంచి తప్పించడంపై 18 ఏళ్ల వుషు అథ్లెట్‌ దివ్యాంషి ఆవేదన వెలిబుచ్చింది. ఇక తనకు చావే దిక్కంటూ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ వీడియోను పోస్ట్‌ చేసింది

నాకు చావే శరణ్యం

వుషు అథ్లెట్ దివ్యాంషి ఆవేదన

న్యూఢిల్లీ: చివరి నిమిషంలో ఆసియా క్రీడల నుంచి తప్పించడంపై 18 ఏళ్ల వుషు అథ్లెట్‌ దివ్యాంషి ఆవేదన వెలిబుచ్చింది. ఇక తనకు చావే దిక్కంటూ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ వీడియోను పోస్ట్‌ చేసింది. తొలుత దివ్యాంషిని భారత వుషు జట్టుకు 60 కేజీల సాండా విభాగం నుంచి ఎంపిక చేశారు. ఆ తర్వాత దివ్యాంషి స్థానంలో 2022 రజత పతక విజేత రోషిబినా దేవికి అవకాశం కల్పించారు. అయితే ట్రయల్స్‌లో దేవిపై విజయంతోనే దివ్యాంషి ఆసియాడ్‌ జట్టుకు ఎంపికైంది. కానీ, వైద్య పరీక్షలో గాయం ఉన్నట్టు తేలడంతో పాటు సరైన శిక్షణ లేకపోవడంతోనే దివ్యాంషిని జట్టు నుంచి తప్పించినట్టు భారత వుషు సమాఖ్య తెలిపింది. కాగా, దివ్యాంషి కోచ్‌ మాత్రం గేమ్స్‌ నుంచి తప్పించేంత తీవ్రగాయం ఆమెకు లేదన్నాడు. మరోవైపు శిక్షణ సమయంలో రోషిబినా కావాలనే తనను గాయపరిచిందని దివ్యాంషి ఆరోపించింది. ‘సెలెక్షన్‌ ట్రయల్స్‌లో రోషిబినాను రెండుసార్లు ఓడించా. జపాన్‌ వెళ్లేందుకు భారత జెర్సీ, కిట్‌ కూడా అందింది. ఢిల్లీలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలోనూ పాల్గొన్నా. ఇలాంటి సమయంలో పక్కకు తప్పించడంతో ఇక నాకు చావే దిక్కు’ అని ఆ వీడియోలో వాపోయింది.

Updated Date - Sep 13 , 2026 | 06:45 AM