తన్మయ్ బలోడా ప్రపంచ రికార్డు.. యూత్ టెస్టులో 14 వికెట్లతో సౌథీ రికార్డు బద్దలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:31 PM
భారత్ అండర్-19 జట్టు 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్ అండర్-19 జట్టు 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ తన్మయ్ బలోడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆఖరి నిమిషంలో రోహిత్ యాదవ్ స్ధానంలో జట్టులో చోటు దక్కించుకున్న తన్మయ్ తన స్పిన్ మాయాజాలంతో ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
యూత్ టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా బలోడా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లతో ఈ యువ స్పిన్నర్ సత్తాచాటాడు. గతంలో రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌథీ పేరిట ఉండేది. 2007లో భారత్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌథీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 92 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన్మయ్ కేవలం 73 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టి.. 19 ఏళ్ల సౌథీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికివస్తే... ఆస్ట్రేలియా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసిన కంగారు జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 151 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ ముందు కేవలం 11 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన భారత బ్యాటర్లు విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇవి కూడా చదవండి:
అనుష్క మైదానంలో ఉంటే కోహ్లీ సెంచరీ ఖాయం: రవిశాస్త్రి
అజిత్ అగార్కర్‌కు గంభీర్ భావోద్వేగ వీడ్కోలు.. ‘చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు’
మనం గెలవడం కొందరికి ఇష్టం లేదు.. అర్జెంటీనా ఏకతాటిపై రావాలి: మెస్సి