టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:38 PM
భారత పురుషుల క్రికెట్ జట్టుతో తనకున్న ఐదేళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడటంతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2021 నవంబర్‌లో జట్టులో చేరిన దిలీప్.. తాజాగా కాంట్రాక్ట్ ముగియడంతో పదవి నుంచి వైదొలిగారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత పురుషుల క్రికెట్ జట్టుతో తనకున్న ఐదేళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడటంతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2021 నవంబర్‌లో జట్టులో చేరిన హైదరాబాద్‌కు చెందిన దిలీప్ కాంట్రాక్ట్ ముగియడంతో తన పదవి నుంచి వైదొలిగారు. అతడి ఆయన స్థానంలో శుభదీప్ ఘోష్ నూతన ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఘోష్ జట్టుతో కలసి కానున్నారు.
ఈ సందర్భంగా దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. 'టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఈ ఐదేళ్ల అనుభూతిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. భారత జట్టులోకి అడుగుపెట్టినప్పుడు నిబద్ధతతో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు ఇష్టమైన ఆటలో ఫీల్డింగ్ ద్వారా దేశం కోసం నా వంతు పాత్ర పోషించినందుకు ఎంతో గర్విస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు.
2023 వన్డే ప్రపంచకప్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్ అనంతరం ఇచ్చే 'ఫీల్డింగ్ మెడల్' సంప్రదాయాన్ని ప్రారంభించి ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన ఘనత దిలీప్‌కే దక్కుతుంది. ఈ సంప్రదాయం క్రీడాకారుల్లో విపరీతమైన పోటీతత్వాన్ని, నవ్వులను నింపిందని, ఈ జ్ఞాపకాలు తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని దిలీప్ గుర్తుచేసుకున్నారు.
దిలీప్ హయాంలో భారత్ రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024, 2026), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్‌లు (2023, 2025) గెలవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ (2023)లలో రన్నరప్‌గా నిలిలిచింది. ఈ విజయాలు తన జీవితంలో మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. బీసీసీఐ (BCCI)తో పాటు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇతర మద్దతు బృందానికి దిలీప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పాటు బ్లూ జెర్సీ ధరించడం తనకు లభించిన గౌరవమని ముగించారు.
ఇవి కూడా చదవండి:
రియాలిటీ షోలో మెరిసిన టీమిండియా బౌలింగ్ కోచ్.. వీడియో వైరల్
బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో ఊరట.. స్పందించిన మహిళా రెజర్లు..