సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అలాంటి భాగస్వామిపై క్రిమినల్ కేసులు..
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:19 PM
సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.
ఢిల్లీ: సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. పెళ్లి కాలేదనే కారణంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. వివాహం జరగలేదన్న కారణాన్ని చూపి బాధితురాలికి చట్టపరమైన రక్షణ కల్పించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా భర్త అనే పదానికి ధర్మాసనం విస్తృత వివరణను ఇచ్చింది. సహజీవన చేస్తున్న వ్యక్తిని భర్తతో సమానంగా పరిగణించవచ్చని తెలిపింది. ఇలాంటి వ్యక్తులు భాగస్వామిని వేధించి తప్పించుకోలేరని ధర్మాసనం పేర్కొంది. అయితే, అన్ని రకాల సహజీవనాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తూ హింసకు పాల్పడిన వారికే సెక్షన్ 498-ఏ వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే, ప్రాథమిక విచారణ నిర్వహించకుండా తక్షణ అరెస్టులు చేయవద్దని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సెక్షన్ 498-ఏ ఉద్దేశాన్ని ధర్మాసనం వివరించింది. ఈ సెక్షన్ మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల మానసిక, శారీరక వేధింపుల నుంచి రక్షించడానికే అని గుర్తు చేసింది. అలాంటి వేధింపులు కేవలం చట్టబద్ధమైన వివాహ బంధంలోనే జరుగుతాయని భావించడం వాస్తవాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. వివాహిత మహిళకు ఒక రకమైన రక్షణ కల్పించి, అదే తరహా సంబంధంలో ఉన్న మరో మహిళకు రక్షణ నిరాకరించడం సహేతుకం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును చట్టం గుర్తించిందని ధర్మాసనం తెలిపింది. ఆ విధంగా భాగస్వామిని ఎంచుకున్న మహిళకు చట్టపరమైన రక్షణను నిరాకరించలేమని పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళకు తన భాగస్వామి లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైతే ఆమెకు కూడా సమాన చట్టపరమైన రక్షణ కల్పించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి
లైంగిక వేధింపుల కేసు.. కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కొత్త టెక్నాలజీ..